బొత్సను ఓడించాలంటే ఎస్సీ అభ్యర్ధే సరైన మార్గమా?

ఏపీలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు 2024 లో జరగాలి. కానీ ముందస్తు ఎన్నికలు కూడా జరగొచ్చనే ప్రచారమూ సాగుతోంది. సరే … ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు…

ఏపీలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు 2024 లో జరగాలి. కానీ ముందస్తు ఎన్నికలు కూడా జరగొచ్చనే ప్రచారమూ సాగుతోంది. సరే … ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నాయి. 

టీడీపీలోని పెద్ద నాయకులను ఓడించడానికి వైసీపీ ప్లాన్ చేస్తుంటే, వైసీపీలోని దిగ్గజ నేతలను ఓడించడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఏ నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టాలో అన్ని పార్టీలు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాయి. సామాజిక సమీకరణాల లెక్కలు వేసుకుంటున్నాయి. పార్టీలు ప్రాథమికంగా కొన్ని అంచనాలకు వస్తున్నాయి. 

ఇందుకు సంబంధించి మీడియాలో రరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ కొందరు అభ్యర్థులను నిర్ణయించినట్లు వస్తున్న వార్తలు ప్రాథమిక అంచానాలే తప్ప ఫైనల్ కాదు. ఇంకా మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం ఉంది.  

విజయనగరం జిల్లాతోపాటు చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బొత్స కుటుంబ స‌భ్యులు ఆధిప‌త్యానికి గండి కొట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి గ‌ట్టి ప‌ట్టుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు, వైసీపీ ఒక‌సారి విజ‌యం సాధించాయి.  

టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత మొత్తం 9 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే ఆరుసార్లు టీడీపీ, మూడుసార్లు బొత్స సత్యనారాయణ గెలుపొందారు. 

బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు చెక్ పెట్టడం ద్వారా విజయనగరం జిల్లాలో తన ప్రాభవాన్ని పునరుద్ధించుకోవడానికి టీడీపీ వ్యూహాలు రూపొందిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో బొత్స‌కు ప్ర‌త్య‌ర్థిగా మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున‌ను బ‌రిలోకి దింపింది. 

అయితే ఆయ‌న‌కు దీటుగా నాగార్జున వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతున్నార‌ని భావిస్తున్న టీడీపీ అధిష్టానం ఈసారి బ‌ల‌మైన ఎస్సీ నేతను దింపాల‌నే యోచ‌న‌లో ఉంది. ఎస్సీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపి బొత్స‌ను ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆ పార్టీ వ్యూహాలు ప‌న్నుతోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న కిమిడి నాగార్జున కు మ‌రోచోట నుంచి అవ‌కాశం క‌ల్పించి ఆ స్థానంలో వేరే బ‌ల‌మైన అభ్య‌ర్థికి అవ‌కాశం ఇవ్వాల‌నే యోచ‌న‌గా ఉంది. శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి, లేదంటే కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన కొండ్రు ముర‌ళీమోహ‌న్ ను కానీ బ‌రిలోకి దింపాల‌నే స‌మాలోచ‌న‌లు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి బొత్స ఓటమికి చివరగా టీడీపీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.