విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన తమ్ముడు శివనాథ్ (చిన్ని) మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా తన అన్న ఫిర్యాదుపై చిన్ని ఘాటుగా స్పందించారు. తన భార్యను వివాదంలోకి లాగడం సరైంది కాదని ఆయన హితవు చెప్పారు.
ఎంపీ వాహనం నకిలీ స్టిక్కర్‌తో టీఎస్07హెచ్‌డబ్ల్యూ7777 నెంబర్ గల వాహనం హైదరాబాద్, విజయవాడలలో తిరుగుతోందని కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం తెరపైకి వచ్చింది. పోలీసుల విచారణలో ఈ వాహనం నాని సోదరుడు చిన్ని భార్య జానకిలక్ష్మి పేరుపై వుందని తేలింది. చర్యలు తీసుకోవాలని నాని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో నాని తమ్ముడు చిన్ని మీడియాతో మాట్లాడుతూ విజయవాడ ఎంపీ తనకు శత్రువు కాదన్నారు. స్వయాన అన్న అవుతాడన్నారు. చిల్లర వివాదంలోకి తన భార్యను లాగడం బాధించిందన్నారు. ఆ స్టిక్కర్ ఎవరిదో విచారణలో తేలుతుందన్నారు. హైదరాబాద్ పోలీసులు తనకు క్లీన్‌చిట్ ఇచ్చారన్నారు.
ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య విజయవాడ ఎంపీ టికెట్ వివాదానికి దారి తీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్ని హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని సమాచారం. తరచూ కేశినేని నాని ఏదో ఒక కారణంతో పార్టీపై అలకబూనడం, పార్టీలోని ముఖ్యులతో విభేదించడం తదితర అంశాలు తలనొప్పిగా మారాయి.
మరోవైపు విజయవాడలో చిన్ని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తనకు వ్యతిరేకంగా తమ్ముడిని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం కూడా కేశినేని నానిలో వుంది. ఆ కారణంతోనే అప్పుడప్పుడు పార్టీపై వ్యతిరేకత ప్రదర్శించేలా చేస్తున్నాయనే అభిప్రాయం కూడా ఉంది.
అందుకే విజయవాడ ఎంపీ టికెట్ తాను కోరుతున్నాననే అక్కసుతో అన్న ఫిర్యాదు చేశాడని చిన్ని భావిస్తున్నారు. తాను టికెట్ కోరడం లేదని మీడియాతో ప్రత్యేకంగా చెప్పడాన్ని గుర్తించవచ్చు. పార్టీ ఆదేశిస్తే అన్న గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించడం ద్వారా కేశినేని నానిని ఆత్మరక్షణలో పడేసినట్టైంది.
తనపై రాజకీయ విమర్శలు చేయొచ్చని చిన్న చెప్పడం విశేషం. కానీ ఇంట్లో ఆడవాళ్లను వివాదంలోకి లాగిన అన్నపై చిన్ని కాస్త ఆగ్రహించారు. అన్న ఫైర్ అవుతుంటే, తమ్ముడు మాత్రం కూల్‌గానే చెక్ పెడుతున్నారనే చర్చకు తెరలేచింది.