సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణకు నోటి దురుసు ఎక్కువ. ఏం మాట్లాడుతుంటారో ఒక్కోసారి ఆయనకే తెలియదు. పార్టీ వాళ్లో, తిట్లు తిన్నవాళ్లో సీరియస్ అయితే, వెంటనే తప్పైందని చెంపలేసుకోవడం ఆయనకు అలవాటైంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై నారాయణ తన మార్క్ అవాకులు చెవాకులు పేలారు. ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు.
అయితే రాజకీయాల్లో ఒక్కోసారి ఇలాంటి వాటిని ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే రాజకీయాలు అంత సంస్కారంగా నడవడం లేదు. నోరున్న వాళ్లదే రాజకీయం అన్నట్టుగా తయారైంది. కానీ జనసేన నాయకుడు నాగబాబు రియాక్షన్ చూస్తే…ఈ పార్టీ రాజకీయాలకు పనికొస్తుందా? అనే అనుమానం ఎవరికైనా కలగకమానదు. ఇదే చంద్రబాబును వైసీపీ నేతలు, జగన్‌ను టీడీపీ నేతలు ఎన్నెన్ని తిట్లు తిట్టి వుంటారు?
ఒక్కోసారి హద్దులు దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజూ జగన్, ఆయన కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా, అందులో పాల్గొనే ప్రతిపక్ష నేతలు, విశ్లేషకుల ముసుగులోని పచ్చ బ్యాచ్, అలాగే అధికార ప్రతినిధులకు మించి యాంకర్ల పైత్యం చూస్తూనే వున్నాం. చంద్రబాబు, లోకేశ్‌ను వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు తదితరులు మామూలుగా తిడుతున్నారా?
జనసేన నాయకుడు నాగబాబులా జీర్ణించుకోలేకుంటే జగన్‌ను తీవ్ర పదజాలంతో దూషించే వాళ్ల తలలు రోజుకు ఎన్ని ఎగరాలో అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాగే చంద్రబాబు, లోకేశ్‌లను అభ్యంతరకర భాషలో తిట్టే వాళ్లను టీడీపీ వాళ్లు ఏం చేయాలి? చిల్లర బేరగాడు అని చిరంజీవిని పొరపాటునో, గ్రహపాటునో సీపీఐ నాయకుడు నారాయణ మాట తూలారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవిపై నారాయణ అలా మాట్లాడకుండా ఉండాల్సిందనే అభిప్రాయంలో రెండో మాటకే స్థానం లేదు.
కానీ నారాయణకు గడ్డి తినడం మాన్పించి, అన్నం తినడం నేర్పాలని నాగబాబు తన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. జనసేన పంథా మొదటి నుంచే ఇట్లే సాగుతోంది. పవన్‌ను, జనసేన నాయకులను ఎవరూ ఏమీ అనకూడదు. కానీ వాళ్లు మాత్రం టీడీపీ, వైసీపీ వాళ్లను ఆయా సందర్భాల్లో ఎన్నైనా తిట్టొచ్చు. తనను ఫలానా నాయకుడు అలా తిట్టాడు, ఇలా తిట్టాడని, తోలు తీస్తానని పవన్ బహిరంగ సభల్లో తరచూ హెచ్చరిస్తుంటారు.
ఇదేం పద్ధతో అర్థం కాదు. విమర్శలకు చేతనైతే కౌంటర్ ఇవ్వాలి. అంతేగానీ ఈ హెచ్చరికలు ఏంటో మరి! రాజకీయాల్లో విమర్శలు, దూషణలు సర్వసాధారణమైన పరిస్థితుల్లో నాగబాబు రియాక్షన్ కాస్త విపరీత ధోరణి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ నేతలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నారని… జనసేన స్పందన చూసిన తర్వాత చాలా మంది అంటున్నారు. ఇది కాదనలేని వాస్తవం.