ఎన్నికల్లో వైసీపీకి ఐ ప్యాక్, టీడీపీకి రాబిన్‌శర్మ టీమ్ పని చేశాయి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని సంబంధిత పార్టీల అధినేతల దృష్టికి తీసుకెళ్లే పనిలో బిజీగా గడిపాయి. ఎన్నికలు ముగిశాయి. ఎవరి లెక్కలు వారివి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాపై రాబిన్‌శర్మ టీమ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సమర్పించిన నివేదిక సమాచారం తెలిసింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి కేవలం రెండు నుంచి మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కుతాయని బాబుకు రాబిన్‌శర్మ టీమ్ నివేదించడం గమనార్హం. రాయలసీమలో వైసీపీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఫస్ట్ ప్లేస్‌లో వుంది. ఈ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఐదేళ్లలో టీడీపీ చెప్పుకోతగ్గ స్థాయిలో బలపడ లేదని రాబిన్‌శర్మ టీమ్ అభిప్రాయం.
కర్నూలు జిల్లాలో టీడీపీని బలోపేతం చేసుకోడానికి చంద్రబాబు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. టీడీపీకి బలమైన నాయకత్వం ఆ జిల్లాలో లేదు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి తదితరులు ఉన్నప్పటికీ, వయసు రీత్యా వాళ్లు ప్రజలతో మమేకం కాలేని పరిస్థితి. కేవలం బనగానపల్లెలో మాత్రమే మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి బలంగా ఉన్నారు. మిగిలిన నాయకులంతా ఎన్నికల సమయంలోనే హడావుడి చేశారు.
టీడీపీ బలంతో గెలవాలనుకున్నారే తప్ప, తమకంటూ సొంత బలాన్ని ఏర్పరచుకోలేకపోయారు. కొన్ని చోట్ల టీడీపీ నాయకులే ఆ పార్టీకి మైనస్‌గా మారారు. ఇవన్నీ టీడీపీ పుంజుకోకపోవడానికి ప్రధాన కారణాలుగా రాబిన్‌శర్మ మొదట్లోనే గుర్తించి, చంద్రబాబుకు నివేదించింది. అయినప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.