ఎల్లో మీడియా అతి మామూలుగా లేదు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామా? రాలేమా? అని కూటమి నేతలు దిక్కుతోచక జుత్తు పీక్కుంటున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడిని సీఎంగా చూడాలని భక్త మీడియా మాత్రం …ఇక అధికారంలోకి వచ్చినట్టే ఫీల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎల్లో చానల్స్‌లో బాబును సీఎంగా ఊహించుకుంటూ, వండివారుస్తున్న కథనాలు టీడీపీ కేడర్‌కు సైతం వెగటు పుట్టిస్తున్నాయి.
అప్పుడే చంద్రబాబునాయుడికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు టచ్‌లోకి వెళ్లారట. తమ మెడపై జగన్ సర్కార్ కత్తి పెట్టడం వల్ల, నిస్సహాయ స్థితిలో చేయాల్సి వచ్చిందని బాబుకు వివరణ ఇచ్చుకుంటున్నట్టు కథనాలు వండివార్చడం వారికే చెల్లింది. అయితే తాను మారిన చంద్రబాబు అని, గతంలో మాదిరిగా మెత్తగా ఉండనని అలాంటి అధికారులకు బాబు తేల్చి చెప్పినట్టు తమ మార్క్ కథనాలను ప్రసారం చేయడం విశేషం.
సీరియస్ కామెడీని పండించడంలో ఎల్లో చానల్స్ ఆరితేరిపోయాయి. ఇటీవల ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేశ్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. పిచ్చి పిచ్చిగా వాగుడిని యథేచ్ఛగా ప్రసారం చేసి, ఎల్లో చానల్స్ అభాసుపాలైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు బాబు ముఖ్యమంత్రి అయ్యినట్టుగా తాము భ్రమల్లో మునిగి తేలుతూ, అదే నిజమని భావించి, అధికారులు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని కథనాలు చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే జనం తమ కథనాలను చూసి నవ్విపోతారనే వెరపు లేకుండా, అతిశయోక్తులతో కూడిన కథనాలు ప్రసారం చేయడం ఆ చానల్స్‌కే చెల్లింది. ఎవరైనా ఏమన్నా అనుకోని, తాము అనుకున్నదే చెబుతాం అన్నట్టుగా తయారైంది ఆ మీడియా వ్యవహారం.