తీగ‌ల కృష్ణారెడ్డి మ‌న‌వ‌డు దుర్మ‌ర‌ణం

రోడ్డు ప్ర‌మాదంలో హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణారెడ్డి మ‌న‌వ‌డు, బీఆర్ఎస్ మాజీ కార్పొరేట‌ర్ తీగ‌ల సున‌రిత‌రెడ్డి కుమారుడు కనిష్క్‌రెడ్డి (19) దుర్మ‌ర‌ణం చెందారు.

రోడ్డు ప్ర‌మాదంలో హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణారెడ్డి మ‌న‌వ‌డు, బీఆర్ఎస్ మాజీ కార్పొరేట‌ర్ తీగ‌ల సున‌రిత‌రెడ్డి కుమారుడు కనిష్క్‌రెడ్డి (19) దుర్మ‌ర‌ణం చెందారు. హైద‌రాబాద్ శివారులోని గొల్ల‌ప‌ల్లి క‌లాన్ ద‌గ్గ‌ర ఔట‌ర్ రింగ్‌రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారుతో క‌నిష్క్ వేగంగా ఢీకొట్టాడు. దీంతో అత‌ను తీవ్ర గాయాల‌పాల‌య్యాడు.

పోలీసులు వెంట‌నే అక్క‌డికి వెళ్లి క‌నిష్క్‌ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ అత‌ను తుది శ్వాస విడిచాడు. అర్ధ‌రాత్రి ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. క‌నిష్క్ మృతి స‌మాచారాన్ని పోలీసులు ఆ యువ‌కుడి త‌ల్లికి ఫోన్ చేసి చెప్పారు.

బీటెక్ రెండో ఏడాది చ‌దివే కనిష్క్ జూబ్లీహిల్స్‌లోని త‌న స్నేహితుడి ఇంట్లో ఫంక్ష‌న్‌కు వెళ్లాడు. అనంత‌రం అర్ధ‌రాత్రి తిరిగి వెళ్తుండ‌గా ప్ర‌మాదానికి గుర‌య్యాడు. త‌ల‌కు తీవ్ర గాయం కావ‌డంతో ప్రాణాలు కోల్పోయిన‌ట్టు స‌మాచారం. శంషాబాద్ పోలీసులు మొద‌ట క‌నిష్క్‌ని ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత త‌ల్లిదండ్రులు వెళ్లి కార్పొరేట్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. దీంతో తీగ‌ల కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.

టీడీపీ హ‌యాంలో తీగ‌ల కృష్ణారెడ్డి హైద‌రాబాద్ మేయ‌ర్‌గా ప‌ని చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మ‌హేశ్వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌ల్‌రెడ్డి రంగారెడ్డిపై గెలుపొందారు. ఆ త‌ర్వాత ఆయ‌న బీఆర్ఎస్‌లో చేరారు. 2018లో బీఆర్ఎస్ త‌ర‌పున పోటీ చేసి, కాంగ్రెస్ నాయ‌కురాలు, మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంత‌రం స‌బితా బీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా కూడా ప‌ని చేశారు. తీగ‌ల కృష్ణారెడ్డి 2025లో బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.

10 Replies to “తీగ‌ల కృష్ణారెడ్డి మ‌న‌వ‌డు దుర్మ‌ర‌ణం”

  1. ఎందరో రాజకీయ నాయకుల పిల్లలు, మనవాళ్ళు యిలాగే అర్ధాంతరంగా రాలిపోతున్నారు.

    నాయకుల పాపాల ఫలితమేనా ??

    ఇప్పటికి నాయకుల్లో మార్పు రావటం లేదుకదా !

Comments are closed.