“అర్థరాత్రి.. నడిరోడ్డుపై చిందరవందరగా కరెన్సీ నోట్ల కట్టలు.. జీపుతో ఢీకొట్టిన పోలీసులు.. ఆ వెంటనే పెద్ద ఛేజ్.. ” ఇదేదో సినిమా స్టోరీ అనిపిస్తోందా? యాక్షన్ థ్రిల్లర్ ను తలపిస్తోందా? కానీ ఇది సినిమా స్టోరీ కాదు. రాత్రి తెలంగాణలో నిజంగా జరిగిన ఘటన. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది ఈ దోపిడీ.
నలుగురు దొంగలు, పక్కా ప్లాన్ వేశారు, ఏటీఎం ను లేపేయాలని ప్లాన్ చేశారు. పథకాన్ని అనుకున్నది అనుకున్నట్టు అమలు చేశారు. కోరుట్లలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంకు కన్నంవేశారు. డబ్బును సంచిలో పెట్టుకొని సక్సెస్ ఫుల్ గా బయటకొచ్చారు. ఇక డబ్బుతో వాహనం ఎక్కి పారిపోవడం ఒక్కటే బ్యాలెన్.
సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఊహించని విధంగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. దొంగలు పారిపోతున్నారని గ్రహించిన పోలీసులు, తమ వాహనంతో దొంగల కారును ఢీకొట్టారు. దీంతో చేసేదేం లేక డబ్బును అక్కడే విసిరేసి పారిపోయారు దొంగలు.
కానీ పోలీసులు తగ్గలేదు. దొంగల్ని ఛేజ్ చేశారు. యాక్షన్ సినిమాను తలపించిన ఈ ఘటనలో పారిపోయే క్రమంలో దొంగలు నోట్ల కట్టల్ని విసిరేయడంతో, రోడ్డుపై చిందరవందరగా నోట్ల కట్టలు పడ్డాయి.
అలా చెల్లాచెదురైన నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 19 లక్షల 200 రూపాయలు క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు.
చోరీ జరుగుతున్న విషయాన్ని ఏటీఎంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక నిఘా విభాగం పసిగట్టింది. ఆటోమేటిగ్గా పోలీస్ స్టేషన్ కు అలెర్ట్ వెళ్లిపోయింది. దీంతో క్షణాల్లో పోలీసులు ఏటీఎం ముందు వాలిపోయారు. సక్సెస్ ఫుల్ గా దోపిడీని అడ్డుకున్నారు.