పాక్‌లో టెర్రరిస్టులు… కర్రెగుట్టల్లో మావోయిస్టులు

చిత్తడి దారుల్లో విష కీటకాలతో ప్రమాదం పొంచి ఉంది. దీంతో.. ‘ఆపరేషన్‌ కర్రెగుట్టలు’ బలగాల పాలిట మరింత కఠినంగా మారింది.

మీడియాలో నిన్నంతా ఉదయం నుంచి రాత్రి వరకు ఆపరేషన్ సిందూర్ వార్తలే. దానికి సంబంధించిన కథనాలే. భారత సైన్యం తొమ్మిది ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడం, 80 మందికి పైగా ఉగ్రవాదులు హతం కావడం తెలిసిన సంగతే. ఆపరేషన్ సిందూర్ ప్రభంజనంలో కర్రెగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది చనిపోయిన ఘటనకు ప్రాధాన్యం లేకుండా పోయింది.

పాకిస్తాన్‌పై దాడులు జరగకుండా ఉంటే కర్రెగుట్టలులో ఎన్కౌంటర్ వార్తల్లో ప్రముఖంగా ఉండేది. టెర్రరిస్టులను చంపడానికి ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టారు. మావోయిస్టులను చంపడానికి ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు విదేశానికి అంటే పాకిస్తాన్‌కు చెందిన వారైతే మావోయిస్టులు అంటే మన దేశానికి చెందినవారు.

ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేస్తామంటూ ప్రధాని, రక్షణ మంత్రి ప్రతిన బూనగా, మావోయిస్టులను నామరూపాలు లేకుండా చేస్తామని, వచ్చే ఏడాది మార్చి ఆఖరునాటికి వారి ఉనికి లేకుండా చేస్తామని హోం మంత్రి అమిత్ షా డెడ్లైన్ పెట్టుకున్నారు. ఛత్తీస్‌గ‌ఢ్‌, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో జరిగిన భీకర పోరులో 26 మంది మావోయిస్టులు చనిపోయారని బస్తర్ రేంజ్ పోలీసు అధికారులు చెప్పారు.

చనిపోయినవారిలో ఓ అగ్ర నాయకుడు కూడా ఉన్నాడని అన్నారు. అయితే ఎంతమంది మావోయిస్టులు చనిపోయారనేది సరిగా తెలియదు. కొందరు 26 అంటుంటే, కొందరు 22 అంటున్నారు. ఇంకొందరు 28 అని చెబుతున్నారు. ఇక్కడ కూడా డ్రోన్‌ కెమెరాలు, వైమానిక దళ హెలికాప్టర్లు, ఇతర అత్యాధునిక సాంకేతికతతో మావోయిస్టుల కదలికలను గుర్తించి వారిని హతమార్చారు. ఎండాకాలం.. ఆకులు రాలి.. కర్రెగుట్టల్లో నక్కిన మావోయిస్టులను గుర్తించాలనే పోలీసుల ఆలోచనలకు అకాల వర్షాలు అడ్డంకిగా మారాయి.

మొన్నటి వరకు ఉక్కబోతతో మండే కొలిమిని తలపించిన కర్రెగుట్టలు.. రెండు వర్షాలకే మళ్లీ పచ్చటి, దట్టమైన అడవిగా.. గంభీరంగా మారిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. గుట్టల పైనుంచి జలపాతాల్లోంచి నీళ్లు జాలువారుతున్నాయి. వర్షాల కారణంగా గుట్టల మధ్య దారులు చిత్తడిగా మారిపోయాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికే చీకటిపడుతూ.. ఆపరేషన్‌లో ఉన్న జవాన్లకు ఇబ్బందిగా మారింది.

పైగా.. చిత్తడి దారుల్లో విష కీటకాలతో ప్రమాదం పొంచి ఉంది. దీంతో.. ‘ఆపరేషన్‌ కర్రెగుట్టలు’ బలగాల పాలిట మరింత కఠినంగా మారింది. మావోయిస్టుల గాలింపు క్లిష్టంగా మారుతున్న సమయంలో మావోయిస్టులు తెలంగాణలోని పూసుగుప్ప వైపు వచ్చినట్లు కేంద్ర బలగాలు అనుమానిస్తూ.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టులు కర్రెగుట్టల నుంచి వెళ్లే ముందు ఎక్కడికక్కడ మందుపాతరలు, ప్రెజర్‌ బాంబులను అమర్చారు.

డ్రోన్‌ కెమెరాలకు మావోయిస్టుల కదలికలు చిక్కినా.. ఆ ప్రాంతాలకు బలగాలు చేరుకోవడం కత్తిమీద సాముగా మారింది. భారీ ఎన్కౌంటర్ జరగడానికి ఒక్కరోజు ముందే జవాన్లు 250 బాంబులను గుర్తించి, నిర్వీర్యం చేశారు. వందల సంఖ్యలో మావోయిస్టుల స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేశారు. చివరకు భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు.