తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక పక్కకు పోయింది. నిన్నటి వరకూ మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు తలమునకలైన వివిధ పార్టీల నేతల ప్రచారాలను చూశాం. రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. కొనుగోలు అంశం కేంద్రంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ కుట్రల్ని తేల్చేస్తామంటూ బీజేపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొస్తూ తమదైన రీతిలో తిప్పికొడుతున్నారు. టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలతో ఒక స్వామీజీతో పాటు మరో ఇద్దరు బేరసారాలు ఆడిన సంగతి తెలిసిందే.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం తమకేంటని? ప్రజలే నాయకుల్ని తయారు చేసుకుంటారని బీజేపీ చెబుతోంది. మరీ ముఖ్యంగా రేవంత్‌రెడ్డి ఎపిసోడ్లో వీడియో రికార్డును బయట పెట్టినట్టు, ఈ కేసులో టీఆర్ఎస్ ఎందుకు చేయలేదని బీజేపీ ప్రశ్నిస్తోంది. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి దిక్కుమాలిన కుట్రలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు విమర్శిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు లాంటి అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని టీఆర్ఎస్ ఆ పార్టీని దోషిగా నిలబెట్టే క్రమంలో ఈ వ్యూహం పన్నిందనే చర్చకు తెరలేచింది. మొత్తానికి మునుగోడులో ఏం జరుగుతున్నదో పక్కకు పోయి, ఇతరత్రా విషయాలు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.