ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కష్టాలు ప్రత్యర్థులకూ వద్దనేలా ఉన్నాయి. వీర్రాజు ప్రత్యేకత ఏమంటే… ఏం మాట్లాడ్తారో ఆయనకే అర్థం కాదు. మాట్లాడాల్సిన అంశం కాకుండా, మీడియాకి, జనానికి మరోలా అర్థమవుతోంది. ఇదే ఆయన బాధ, ఆవేదన. తెలుగులోనే మాట్లాడ్తారు కానీ , అదేంటో వీర్రాజు చెప్పినదాన్ని అర్థం చేసుకునేందుకు జుత్తు పీక్కోవలసిన పరిస్థితి. గతంలో మద్యం అమ్మకాలపై కూడా ఆయన అలాగే మాట్లాడారు.
రాయలసీమవాసులను ఖూనీకోరులుగా అభివర్ణించి, ఆ తర్వాత తీవ్ర వ్యతిరేకత రావడంతో క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తాజాగా జనసేనతో పొత్తుపై పదేపదే ఆయన సానుకూలంగా చెబుతున్నా, అందుకు విరుద్ధమైన సందేశం జనాల్లోకి వెళుతోంది. పాజిటివిటీ కంటే నెగెటివిటీకి ఆదరణ ఎక్కువనే సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన నో కామెంట్, మాట్లాడుకుని చెబుతాం లాంటి సమాధానాలు రావడంతో రకరకాల అనుమానాలు, ప్రచారానికి అవకాశం ఇచ్చినట్టైంది. అసలే పవన్‌కల్యాణ్‌తో వీర్రాజు సరిగా సమన్వయం చేసుకోకపోవడం వల్లే చంద్రబాబుతో కలిసిపోతున్నారనే విమర్శ స్వయంగా ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ ఇటీవల చేసిన సంగతి తెలిసిందే. ఇది బీజేపీలో కలకలం రేపింది.
తన వల్ల పొత్తు చిత్తు అవుతుందనే సంకేతాలు వెల్లువెత్తుతుండడం సోము వీర్రాజుకు తలనొప్పిగా మారింది. ఈ చెడ్డ పేరు నాకెందుకు దేవుడా అని ఆయన అనుకున్నట్టున్నారు. మళ్లీ ఇవాళ ఆయన మీడియా ముందుకొచ్చారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. జనసేనతో, జనంతోనూ పొత్తు పెట్టుకుంటామని ఎప్పట్లాగే ఆయన కామెడీ చేశారు. జనసేనకు దూరంగా వుండాలని తాను అన్నట్టు సాగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.
అదేదో జనసేన, బీజేపీ నేతలు దగ్గరగా ఉన్నట్టు… సోము వీర్రాజు బడాయి మాటలు. బీజేపీతోనే పొత్తు వుంటుందని పవన్‌కల్యాణ్ నోటి నుంచి ఇంత వరకూ ఒక్క మాట కూడా రాలేదు. టీడీపీతో అంటకాగుతున్న జనసేనాని తోక పట్టుకుని వేలాడుతున్న బీజేపీని చూస్తే… జాలిపడాలో, కోప్పడాలో జనానికి తెలియని పరిస్థితి.