ఉత్తరాంధ్రా జిల్లాల పట్టభద్రుల ఎన్నికల కోలాహలం ప్రారంభం అయింది. అందరి కంటే ముందుగా వైసీపీ తన అభ్యర్ధిని ప్రకటించింది. ఇక వామపక్షాల అభ్యర్ధి కూడా ఆ తరువాత బరిలోకి దిగారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మరోసారి పోటీ చేయనున్నారు. తెలుగుదేశం అన్నీ ఆలోచించుకుని చివరికి తన అభ్యర్ధిగా భీమిలీ మాజీ చైర్ పర్సన్, జీవీఎంసీ కార్పోరేటర్ గాడు చిన్ని కుమారిని నిలబెట్టింది.
ఇపుడు అందరి చూపూ జనసేన మీద ఉంది. ఈ రోజు దాకా జనసేన పార్టీలో ఎమ్మెల్సీ సందడి లేదు. ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్న దాని మీద చర్చ కూడా సాగడంలేదు. దాంతో జనసేన పోటీ చేయదు అని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక జనసేన పోటీలో లేకపోతే ఆ పార్టీ మద్దతు తమకంటే తమకు ఉంటుందని రెండు పార్టీలు చెప్పుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా చూస్తే బీజేపీతో జనసేన మితృత్వం కలిగి ఉంది. జనసేన పోటీ చేయకపోతే బీజేపీకే మద్దతు ఇస్తారని అంతా భావిస్తున్నారు.
అయితే తెలుగుదేశం అభ్యర్ధి కూడా పోటీలో ఉండడంతో జనసేన ఆ వైపు చూస్తుందా అన్న దాని మీద ఎవరి ఆలోచనలు వారు చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల వరకూ చూస్తే జనసేన బీజేపీకే తన మద్దతు ఇస్తుందని, మిత్ర ధర్మాన్ని పాటిస్తుందని అంటున్నారు. అదే కనుక జరిగితే కమలం పార్టీకి వేయేనుగుల బలం అందించినట్లుగా చెప్పుకోవాలి.
టీడీపీ అభ్యర్ధి గతంలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చరిత్ర ఉంది. ఈసారి ఒంటరిగా పోటీలోకి దిగిన సైకిల్ పార్టీ జాతకం ఎలా ఉంటుందో. ఏది ఎలా ఉన్నా జనసేన మద్దతు కోసం రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయని ప్రచారం సాగుతోంది.