పశ్చిమ రాయలసీమ (కడప, అనంతపురం, కర్నూల్) పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఫలితం తేలలేదు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో ఎవరూ విజయానికి కావాల్సిన ఓట్లను సాధించలేకపోయారు. దీంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి గట్టి పోటీ ఇవ్వడం వైసీపీ నేతలు జీర్ణించుకోలేకున్నారు.
ప్రతి రౌండ్లోనూ నువ్వానేనా అన్నట్టు వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య పోరు సాగుతోంది. మొత్తం 2,45,687 ఓట్లు నమోదయ్యాయి. వీటిలో చెల్లిన ఓట్లు 2,26,448. చెల్లని ఓట్లు 19,239. 11 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. వైసీపీ మద్దతుదారుడు వెన్నపూస రవీంద్రారెడ్డికి 95,969 ఓట్లు, టీడీపీ మద్దతుదారుడైన భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డికి 94,149 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి వైసీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి కేవలం 1820 ఓట్ల ఆధిక్యతలో మాత్రమే ఉండడం గమనార్హం.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ ఒక్కరికీ విజయానికి కావాల్సిన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలు పెట్టారు. అభ్యర్థులిద్దరూ పోటాపోటీగా సమాన ఓట్లు సాధిస్తుండడం గమనార్హం. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లు తమకే ఎక్కువ వస్తాయని, విజయం సాధిస్తామని టీడీపీ ధీమా కనబరుస్తోంది.
ఇక్కడ వామపక్షాలు రెండో ప్రాధాన్యత ఓట్లను టీడీపీకి వేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీకి అనుకూలించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి వైసీపీకి బలమైన పట్టు ఉన్న నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఎదురీదడం షాకింగ్ విషయమే.