ఈ నెల 27న విచారణకు రావాలని మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంపై టీడీపీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేతలు ఎదురు దాడికి దిగారు. ఇవాళ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తన మార్క్ నోటి దురుసును వాసిరెడ్డి పద్మపై ప్రదర్శించారు.
ఈ నేపథ్యంలో బొండా ఉమాకు వాసిరెడ్డి పద్మ దీటైన కౌంటర్ ఇచ్చారు. బొండా ఉమాను కాలికేయుడిగా ఆమె అభివర్ణించారు. మీడియాతో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ తనపై పిచ్చి ప్రేలాపనలు ఏంటని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా మాట్లాడితే చెల్లుతుందని అనుకుంటున్నావా? అని నిలదీశారు.
ఈ రోజుతో నీ కథ అయిపోయిందని అనుకుంటున్నావా అని ఉమాను ప్రశ్నించారు. కెమెరాలను చూడగానే ఊగిపోతే సరిపోదని హితవు చెప్పారు. అత్యాచార బాధితురాలి విషయంలో ఏ హక్కు ఉందని రాజకీయం చేస్తున్నారని టీడీపీని ప్రశ్నించారు.
బాధితురాలిపై అత్యాచారం జరిగిందనే సమాచారం తెలియగానే మహిళా కమిషన్ స్పందించిందని ఆమె చెప్పుకొచ్చారు. సీపీతో మాట్లాడి నిందితులను అరెస్ట్ చేయించామన్నారు. అలాగే బాధితురాలికి తగిన వైద్యం అందించేలా డాక్టర్లతో మాట్లాడామన్నారు.
మూడురోజులైనా ఎక్కడున్నారని తమను ప్రశ్నిస్తున్నారని, 30 రోజులైనా వినోద్జైన్ విషయంలో స్పందించలేని దౌర్భాగ్య పరిస్థితి టీడీపీది అని విరుచుకుపడ్డారు. మూడేళ్లుగా ప్రతి కేసులోనూ మహిళా కమిషన్ స్పందిస్తోందన్నారు. ప్రతి కేసును పర్యవేక్షిస్తోందన్నారు.
బొండా ఉమా రాజకీయం కోసం టీడీపీని బలిపెట్టారని వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు. దాన్ని కప్పి పుచ్చుకోడానికి తనకు పబ్లిసిటీ పిచ్చి అంటున్నాడని ధ్వజమెత్తారు. మూడేళ్లుగా మహిళా కమిషన్ తరపున మహిళల సమస్యలపై పని చేస్తున్నా ఏనాడూ పబ్లిసిటీ కోసం వెంపర్లాడలేదన్నారు. తనకు ఇవాళ పబ్లిసిటీ రావడానికి అంతా నీ పుణ్యమే అని బొండా ఉమానుద్దేశించి వాసిరెడ్డి పద్మ అన్నారు.
బాధ్యత లేకుండా ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఆడవాళ్లు కదా అని ఇష్టానుసారం మాట్లాడితే చెప్పుదెబ్బలు తినే రోజుకొటి ఉంటుందని బొండా ఉమాకు ఘాటైన హెచ్చరిక చేశారామె. బొండా ఉమా ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. ఉమాకు మహిళలే తగిన బుద్ధి చెబుతారన్నారు.