ఆచార్య సినిమా విడుదల రోజుల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. దర్శకుడు కొరటాల శివ మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నారు. విశేషాలు పంచుకుంటున్నారు. అందులో భాగంగా ‘గ్రేట్ ఆంధ్ర’ తో మాట్లాడారు. ఆ విశేషాలు
ఆచార్య ఇలా..
చరణ్ సినిమా చేయాల్సి వుంది నిరంజన్ రెడ్డి నిర్మాణంలో. అలాంటి టైమ్ లో ఆర్ఆర్ఆర్ ప్రతిపాదన వచ్చింది. సరే అని వాయిదా వేసుకునే సమయంలో డాడీతో సినిమా చేస్తారా అంటూ చరణ్ ప్రతిపాదించారు.
నా దగ్గర ఎప్పటి నుంచో ఓ లైన్ వుంది. దానికి ఓ స్థాయి నటుడు కావాలి. మెగాస్టార్ తో సినిమా చేయాలన్న కోరిక కూడా వుంది. ఆ లైన్ చెప్పి, డెవలప్ చేయడం మొదలుపెట్టాను. ట్రయిలర్ లొ చూపించింది ఆచార్య సినిమా నేపథ్యం మాత్రమే. కథ అది కాదు. వేరే.
చరణ్ పాత్ర
సినిమా కథ రాయడం ప్రారంభించినపుడు చరణ్ పాత్ర లేదు. బై డీఫాల్డ్ కథలో ఓ పాత్ర బలంగా తయారవుతూ వచ్చింది. ఎప్పుడయితే ఆ పాత్ర అలా వచ్చిందో చరణ్ తో చేస్తే ఎలా వుంటుందీ అన్న ఐడియా వచ్చింది. మెగాస్టార్ కు చెబితే చరణ్ కు చెప్పమన్నారు. ఆయనకు చెబితే చాలా ఎగ్జయిట్ అయ్యారు. గురుకుల విద్యార్థిగా చరణ్, బ్రాహ్మిన్ అమ్మాయిగా పూజా కనిపిస్తారు.
మహేష్ పేరు ఎలా అంటే
నేను మహేష్ తో చాలా సాన్నిహిత్యంగా వుంటాను. ప్రతీదీ షేర్ చేసుకుంటూ వుంటాను. ఈ సినిమాలో నేను లాక్ అయిపోవడం చూసి, ఈ క్యారెక్టర్ గురించి చెప్పినపుడు, చరణ్ చేస్తే బాగానే వుంటుంది. కానీ ఒకవేళ మీరు లాక్ అయిపోతాను చాలా కాలం అంటే మీకు సాయం చేయడానికి నేను రెడీ అని చెప్పారు. ఆ విధంగా ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
ఎన్టీఆర్ సినిమా
మిర్చి తరువాత నేను అంత హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా చేయలేదు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా అంతకు మించిన హై ఓల్డేజ్ యాక్షన్ తో వుంటుంది. ఈ సబ్జెక్ట్ అన్ని ప్రాంతాలకు నచ్చేది అందుకే ఈసారి తెలుగు సినిమా పరిథులు దాటతాను.
ప్రభాస్ తో సినిమా
ప్రభాస్ తో సినిమా చేయాలని మళ్లీ ఎప్పటి నుంచో వుంది. ఇద్దరం నిత్యం టచ్ లో వుంటాం ఇద్దరం. కచ్చితంగా సినిమా వుంటుంది.
పవన్ కోసం కథ
పవన్ కళ్యాణ్ కోసం ఓ మాంచి నాయకుడి కథ ఏనాడో రాసుకుని వున్నాను. కానీ ఆయన వేరే వేరే కమిట్ మెంట్లతో బిజీ అయిపోయారు. దాంతో సైలంట్ అయిపోయాను.
కామెంట్లు..గ్యాసిప్ లు
ఇప్పుడిప్పుడే కామెంట్లు, గ్యాసిప్ లను లైట్ తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇవి తప్పవు అని అర్థం అయింది. నేను కొంచెం సెన్సిటివ్. సమయం తక్కువ. అందుకే సోషల్ మీడియాకు దూరంగా వుంటున్నాను. చాలా మందిని అలాగే వుండమని చెబుతాను కూడా. అయితే సోషల్ మీడియాలో ఏం జరుగుతోందో నా కోలీగ్స్ అప్ డేట్స్ ఇస్తూనే వుంటారు.
సినిమాల ఏర్పాటు
నేను రైటర్ గా వున్నపుడు హీరోలకు చేరువకావడానికి ఎంతో మంది సాయం చేసారు. యంగ్ డైరక్టర్లకు, రైటర్లకు కూడా నేను అలాగే సాయం చేస్తున్నా. అంతకు మించి మరేం లేదు. నాకు పరిచయాలు వున్నాయి. అంతవరకే ఇందులో ఆర్థిక లావాదేవీలు లేవు.
విఎస్ఎన్ మూర్తి