అపుడెపుడో ఒక బాలల నీతి కధలో ఇనుముని అంతా ఎలకలు కొరికేశాయని మోసపూరితి ఆసామి తన వ్యాపార భాగస్వామితో నమ్మబలుకుతాడు. ఇపుడు చూస్తే అలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
విశాఖ ఉక్కు కర్మాగారానికి సాటి పోటీ అన్నవి వేరేది లేదని అంతా భావిస్తారు. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మెల్లమెల్లగా మొదలెట్టి పూర్తిగా కొరికేయడానికి అంతా సిద్ధం చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలన్న తలపునకు వచ్చినది లగాయితూ ఉక్కు ముక్కలాంటి ఒక్కొక్క అంగాన్ని కొరికేయడం మొదలెట్టేస్తున్నారు.
తాజాగా ఉక్కు కర్మాగారంలోని అతి ముఖ్యమైన అంగంగా ఉన్న కోక్ ఓవెన్ ని ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించడానికి చురుకుగా పావులు కదుపుతున్నారు.
అదే కనుక జరిగితే గుండెకాయ లాంటి ఒక కీలక విభాగం ప్రైవేట్ పరం అవుతుంది. దాంతో ఉక్కు ప్రైవేట్ మరింత సులువు అవుతుంది. ఈ తాజా పరిణామంతో కార్మిక సంఘాలు ఒక్క లెక్కన భగ్గుమంటున్నారు.
ఇదేమి దుర్నీతి అని ప్రశ్నిస్తున్నాయి. ఉక్కు పోరాటానికి జడిసి ఏక మొత్తంగా అమ్మేయకుండా ఇలా విడివిడిగా ప్రధానా భాగాలను ప్రైవేట్ పరం చేయడానికి సాహసిస్తున్నారని తప్పు పడుతున్నారు.
దీని మీద ఉక్కు ఇంటక్ జాతీయ నేత మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఇది మూర్ఖపు చర్య అని ఫైర్ అయ్యారు. ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం ఉక్కు లోని బ్యాటరీస్ ని దెబ్బతీసే పరిస్థితిని తేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఉక్కులో ప్రైవేట్ వ్యక్తులు అడుగు పెడితే ఉక్కు ఊపిరి ఆగిపోతుందని సీఐటీయూ ప్రెసిడెంట్ అయోధ్యారాం అంటున్నారు. దొడ్డిదారి మార్గాలని వెతికి ఉక్కుని తుదికంటా కొరికేస్తామంటే భారీ ఉద్యమాలని చవిచూడాల్సి ఉంటుందని ఉక్కు కర్మిక సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు.