జగన్ సర్కార్ ఆయుష్షు అంతేనట

జోస్యాలు చెప్పేవారు తటస్థులు అయితేనే ఫలితాలు బాగా వస్తాయి. ఆ చెప్పేవారు ప్రత్యర్ధులు అయితే చేయి చూపిన క్షణానే ఇపుడు చస్తావ్ అని ప్రత్యర్ధి పార్టీ అంటారు. ఈ దేశంలో చూస్తే జోస్యాలకు ఏ…

జోస్యాలు చెప్పేవారు తటస్థులు అయితేనే ఫలితాలు బాగా వస్తాయి. ఆ చెప్పేవారు ప్రత్యర్ధులు అయితే చేయి చూపిన క్షణానే ఇపుడు చస్తావ్ అని ప్రత్యర్ధి పార్టీ అంటారు. ఈ దేశంలో చూస్తే జోస్యాలకు ఏ రకమైన కొరత లేదు. అందరూ పంచాంగవేత్తలే. ఇక రాజకీయ పంచాంగాలకు హద్దే లేదు. వారు చెప్పే దానికి ఆధారాలు వివరాలు అసలు అవసరం లేదు, ఎవరూ అడగనూ కూడదేమో

బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు చురుకైన నేత. ఆయన సెటైర్లు కూడా బాగానే వేస్తారు. తాజాగా మీడియా సమావేశం పెట్టి ఆయన మాట్లాడుతూ సడెన్ గా విమర్శల నుంచి జగన్ సర్కార్ ఆయుర్దాయం మీదకు టాపిక్ మళ్ళించేశారు. ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళో ఉండదు, మహా అయితే వచ్చే ఏడాది వినాయకచవితి తరువాత ఏపీలో వైసీపీ ప్రభుత్వమే కనిపించదని జోస్యం చెప్పేశారు.

అంటే 2023లో సెప్టెంబర్ లో జరిగే వినాయకచవితి పండుగ తరువాత అన్న మాట. సరిగ్గా ఏడాది ఉంది. ఈ ఏడాది దాకా మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఉంటుంది అని ఆయన జోస్యం ప్రకారం చెబుతున్నారు. అయితే ఆ మీదట వచ్చే మరో ఆరేడు నెలలను ఎందుకు వదిలేశారో తెలియదు. షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి.

అంటే వైసీపీ సర్కార్ ముందస్తుకు వెళ్తుందని ఆయన భావనా లేక మరో విధంగా సర్కార్ కూలిపోతుందని ఉద్దేశ్యమా ఏదో తెలియదు కానీ ఏడాది గడువు మాత్రమే వైసీపీ సర్కార్  పవర్ లో ఉండేందుకు ఆయన ఇచ్చేశారు. అంతే కాదు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేల్చేశారు.

ఇంతకీ బీజేపీ 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని టోటల్ గా డిపాజిట్లు కోల్పోయిన సంగతిని మాత్రం రాజు గారు మరచిపోతున్నారు అనే వైసీపీ నేతలు అంటున్నారు. ఎంతసేపూ వైసీపీ సర్కార్ పడిపోవాలని, రద్దు కావాలని కోరుకునే బదులు తమ పార్టీ అధికారంలోకి వచ్చే మార్గమేదో చూసుకుంటే కమలానికి రాష్ట్రంలో ఇన్ని పాట్లు ఉండేవి కాదు కదా అన్న రాజకీయ విశ్లేషణలు బహుశా ఆ పార్టీ వారి చెవిన పడవు కదా.