కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి నామినేటెడ్ పోస్టులపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో భాగస్వాములైన మూడు పార్టీల నాయకులు పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం వస్తే ఎలాంటి పదవి తీసుకోవాలే ముందే నాయకులు లెక్కలేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం, నామినేటెడ్ పదవులను త్వరలో ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో నాయకులు తమ ప్రయత్నాల్ని తీవ్రతరం చేశారు.
మరోవైపు ఆశావహులపై నీళ్లు చల్లేలా చంద్రబాబు నామినేటెడ్ పదవుల భర్తీలో ట్విస్ట్ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రావడానికి ఏఏ నాయకులు బాగా పని చేశారు? వారికి పదవులు ఇవ్వొచ్చా? అనే అంశంపై చంద్రబాబు వాయిస్‌తో ఐవీఆర్ఎస్ సర్వే చేయించడం కలకలం రేపుతోంది.
ఇదెక్కడి న్యాయం అంటూ నాయకులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. నామినేటెడ్ పదవులు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఇలా సర్వేల పేరుతో రాజకీయ నాటకానికి తెరలేపారనే విమర్శలు మూడు పార్టీల నాయకుల నుంచి వస్తున్నాయి.
మీ జిల్లాలో, నియోజకవర్గంలో ఫలానా పోస్టుకు ఏ నాయకుడైతే సరైన వ్యక్తి అని భావిస్తున్నారు? ఆయన లేదా ఆమె నిజంగా పార్టీ కోసం కష్టపడ్డారని నమ్ముతున్నారా? అయితే మీ సమాధానం ఇవ్వండి అంటూ సర్వే చేపట్టారు. గతంలో ఎప్పుడూ ఇలా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సర్వేలు చేయలేదని మూడు పార్టీల నాయకులు చెబుతున్నారు. నాయకులపై సర్వేల కత్తి వేలాడుతోంది. దీంతో తమకు పదవులు వస్తాయో, రావో అని నాయకులు ఆందోళన చెందుతున్నారు.