దాదాపు కొన్ని నెలలుగా వార్తల్లో ఉంది అనంత్ అంబానీ- రాధికా మర్ఛెంట్ ల వివాహం అంశం! ఈ దేశం ఇప్పటి వరకూ ఎంత పెద్దటి సెలబ్రిటీ వివాహం గురించి అయినా రెండు మూడు రోజుల పాటు ఆశ్చర్యపోయింది. పెళ్లి ప్రకటన రావడం వార్తల్లో హెడ్ లైన్ గా నిలవడం, ఆ తర్వాత పెళ్లి వేడుకకు సంబంధించి రెండు మూడు రోజుల పాటు హడావుడి సాగడం, వారి పెళ్లి ముచ్చట అలా కొన్ని రోజుల పాటు వార్తల్లోని అంశం.
బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, ఇంకా ఇతర సినిమా వాళ్ల పెళ్లి ముచ్చట్లు ఎంత సాగదీసినా.. కొన్ని రోజులే అవి వార్తల్లోని అంశాలు! అయితే అంబానీల ఇంటి పెళ్లి మాత్రం కొన్ని నెలలుగా వార్తల్లోనే ఉంది! వీరి పెళ్లి అప్పుడెప్పుడో అయిపోయింది కదా.. అనుకునే జనాలు కూడా ఉన్నారు! అయితే అసలు పెళ్లి ఇంకా ఇప్పుడు జరుగుతూ ఉంది. అది కూడా రోజుల తరబడి వేడుకగా! ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఈ వేడుకను కనివినీ ఎరగనట్టుగా చేసుకుంటోంది. అయితే ఇందులో కామన్ మ్యాన్ ఇంట్రెస్ట్ అనేది.. ఎవరెవరు వచ్చారు అనే వరకే!
ఆ జాబితాలో అంతర్జాతీయ ప్రముఖులంతా ఉండటం వల్ల అంబానీల శక్తి ఇది.. అని జనాలు అనుకోవడమే తప్ప సామాన్యులకు అయితే ఈ శ్రీమంతుల ఇంటి వేడుక గురించి ఆసక్తి ఏమీ లేదు! అయితే మీడియాలో మాత్రం గత కొన్ని నెలలుగా అనునిత్యం ఈ పెళ్లితంతు గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి! వీరి పెళ్లిప్రకటన వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచినట్టుగా ఉంది!
ముఖేష్ అంబానీ తనయుడు అనిల్ కు, మరో వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన రాధికకు పెళ్లంటూ అప్పుడెప్పుడో ప్రకటించారు! అప్పటి నుంచి వీరి పెళ్లి తంతు సాగుతూనే ఉంది! ఎంగేజ్ మెంట్, కొన్ని నెలల కిందట ప్రీ వెడ్డింగ్ పార్టీ, ఆ తర్వాత ఏదో క్రూజ్ టూర్ అని, ఇప్పుడు అసలు పెళ్లి అని.. రకరకాల వార్తలు మీడియాలో వస్తూ ఉన్నాయి కొన్ని నెలలుగా! అయితే వీటిల్లో డీటెయిల్స్ లోకి వెళ్లి ఈ వేడుక గురించి చదివే తీరిక ఎంతమందికి ఉందో కానీ.. అంబానీల ఆసక్తి మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది!
ఎంత డబ్బుంటే మాత్రం… ఇలా నెలలకు నెలల తరబడి పెళ్లినే పదే పదే వేడుకలా కొనసాగిస్తారా! అనుకోవాల్సి వస్తోంది! అయితే దీని వల్ల మార్కెట్ కు అయితే నష్టం లేదు. ఈ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ కుటుంబం అటు ఇటుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందట! ఈ ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు వల్ల ఈ హైక్లాస్ పెళ్లి కోసం ఏర్పాట్లు చేసే హైక్లాస్ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలు, ఒకవేళ పారితోషికాలు ఇస్తే ఈ పెళ్లికి హాజరయినందుకు గానూ డబ్బులు తీసుకునే సెలబ్రిటీలు లాభపడుతూ ఉన్నట్టే!
అంబానీలు అనుకుంటే వారింటి పెళ్లికి వెళ్లి భారతదేశంలోని సినీతారలంతా డ్యాన్సులు వేయగలరు! ఆల్రెడీ వారే కాదు, హాలీవుడ్ సెలబ్రిటీలను కూడా దించి వారి చేత గంతులు వేయిస్తోంది అంబానీ కుటుంబం. అది కూడా ఒక రోజో రెండ్రోజులో కాదు.. నెలలకు నెలల తరబడి ఈ వేడుకను కొనసాగిస్తూ.. మీడియాలో దీనిపై అంతే టెంపోని కొనసాగించడానికి ఎంత ఖర్చు చేస్తున్నారో అంచనా వేయడమే కష్టం!
మరి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొడుకు పెళ్లి చేస్తున్న ముఖేష్ అంబానీ ఈ పెళ్లి వేడుక సందర్భంగా తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు హల్దీరామ్స్ బుజియా సేవ్ ప్యాకెట్లను ఇచ్చారనే ప్రచారం కూడా ఒకటి మీడియాలో జరుగతూ ఉంది! అంతర్జాతీయ సెలబ్రిటీలను కూడా తన ఇంటి పెళ్లికి తీసుకొచ్చి, వేల కోట్లు ఖర్చు చేస్తున్న ముఖేష్ అంబానీ తమ కంపెనీలో పని చేసే వారికి మాత్రం మిక్చర్ ప్యాకెట్స్ తో సరిపెడుతున్నాడంటూ ట్రోల్ చేసే వాళ్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే అలాంటి ట్రోల్స్ వల్ల ముఖేష్ కు వచ్చే నష్టం ఏమీ లేదని వేరే చెప్పనక్కర్లేదు!
ఈ పెళ్లి ద్వారా ముఖేష్అంబానీ ఒక కొత్త రికార్డును అయితే సెట్ చేశాడు. డబ్బుంటే పెళ్లి వేడుకను కూడా ఏడాదికి పైనే వార్తల్లో నిలపొచ్చని, వద్దన్నా ప్రచారం వస్తుందని ఈ ఖరీదైన పెళ్లితో రుజువు అయ్యింది. ఈ దేశంలో ఇప్పటి వరకూ ఇలాంటి పెళ్లి వేడుకను ఎవ్వరూ చేసుకోలేదు! ఇంత ఖర్చు పెట్టి ఇలా నెలల తరబడి వేడుకను నిర్వహించే శక్తి కూడా కనుచూపు మేరలో ఎవరికీ ఉండదేమో!
ఇలా దేశంలోనే అత్యంత శ్రీమంతుడుగా నిలుస్తున్న ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి వేడుకతో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నాడు! డబ్బుంటే ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు అనేదే కాదు, ఒకే పెళ్లిని కూడా ఎన్నాళ్ల పాటు అయినా కొనసాగించేలా చేసుకోవచ్చనేది అంబానీ ఫ్యామిలీ కొత్తగా నిరూపిస్తున్న అంశం!