టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ పేరును ప్రకటించారు బీసీసీఐ సెక్రటరీ జై షా! అయితే గతంలో కోచ్ ల ఎంపిక కాస్త భిన్నంగా ఉండేది. ఈ మధ్యకాలంలో బీసీసీఐ అధ్యక్షుడి పేరు కూడా వినిపించడం ఆగిపోయింది. అన్నింటికీ జై షా పేరే వినిపిస్తోంది! టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం అయినా జై షానే, టీమిండియాకు కోచ్ గా ఎవరుఉండాలో ప్రకటించేది కూడా జై షానే! ఈ రెండూ పూర్తి భిన్నమైన పనులు.
అయితే ఈ ఒకే బుర్రతో ఇలాంటి పనులను సునాయాసంగా చేస్తున్నారు జై షా! అదే ఆయన సత్తా! బీసీసీఐ అధ్యక్షుడు, కోశాధికారి ఇలాంటి రకరకాల హోదాలకు సంబంధించిన వార్తలు అప్పట్లో వచ్చేవి. ఇప్పుడు ఏం జరిగినా, ఏం చేసినా జై షానే! ఇంతకీ ఇప్పుడు బీసీసీఐకి అధ్యక్షుడు ఉన్నాడా, లేడా ఉంటే ఆ హోదాలో ఉన్నదెవరో తెలుసుకోవాలంటే గూగుల్ చేయాల్సిందే!
అలాగే ఆ మధ్య బీసీసీఐలో సంస్కరణలు అంటూ లోథా కమిటీ అంటూ రకరకాల మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఏ వ్యక్తి అయినా వరసగా వరసగా సంవత్సరాలకు సంవత్సరాలు రకరకాల హోదాల్లో కొనసాగుతూ బోర్డు వ్యవహరాల్లో తలదూర్చడానికి లేదంటూ, కూలింగ్ పిరియడ్ అంటూ ఒక నియమాన్ని పెట్టారు. దాన్ని కొందరి విషయంలో అమలు చేశారు కూడా! ఆ తర్వాత ఇప్పుడు ఆ సంస్కరణలు ఏ మేరకు పాటిస్తున్నారో ఎవరికీ తెలియదు!
ఇక కోచ్ ఎంపిక విషయానికి వస్తే.. అనిల్ కుంబ్లేను కోచ్ గా ఎంపిక చేసినప్పుడు బీసీసీఐ పెద్ద పరీక్షే పట్టింది ఆసక్తి ఉన్న వారికి. అప్పుడు గంగూలీ, ద్రావిడ్, సచిన్ , లక్ష్మణ్ ఇలాంటి వాళ్లంతా కోచ్ ఎంపికలో పాల్గొన్నారు. ముగ్గురేమో కలిసి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లను ఇంటర్వ్యూ చేసి.. కోచ్ పాత్రకు వారి వద్ద ఉన్న అర్హతలేమిటో చూశారు.
ఇంటర్వ్యూ కు హాజరయిన వారికే ప్రాధాన్యత అని, ఇంటర్వ్యూలో తాము అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానాలను ఇస్తారనేదాన్ని బట్టే ఎంపిక అన్నారు. రవిశాస్త్రి, ఒక విదేశీ కోచ్, పోటీ పడినా అప్పడు కుంబ్లేను ఎంపిక చేశారు. కుంబ్లే తన వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటనేది కోచ్ ఎంపిక కమిటీకి వివరించాడట! దీంతోనే ఆ ఎంపిక జరిగింది. కుంబ్లే కోచ్ గా ఉన్నప్పుడు టీమిండియా బాగానే ఆడింది. కొహ్లీతో విబేధాలతో కుంబ్లే ఆ పోస్టు నుంచి వైదొలిగాడు.
టీమిండియాకు కోచ్ పాత్ర అనేది చిన్నదేమీ కాదు. గెలిచినా, ఓడినా కోచ్ కు దండాలు దస్కాలు పడుతూ ఉంటాయి. ఒక దశలో టీమిండియాకు స్వదేశీ కోచ్ పనికిరాడు అనే సిద్ధాంతం నడిచింది. ఆ పరిస్థితుల్లోనే జాన్ రైట్ కోచ్ అయ్యాడు. విజయవంతమైన కోచ్ గా, భారతీయ క్రికెటర్లకు ఇష్టమైన కోచ్ గా రైట్ శకం నడిచింది. 2003 ప్రపంచకప్ తర్వాత రైట్ ఆ హోదా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత గ్రేగ్ చాపెల్ కోచ్ గా వచ్చాడు. చాపెల్ కోచ్ గా ఉన్న సమయంలో దారుణ పరాజయాలు ఎదురు కావడమే కాదు, జట్టు కూడా అతలా కుతలం అయ్యింది. దీంతో కోచ్ ల ప్రాధాన్యతపై పెద్ద చర్చ లేచింది.
2007 టీ20 ప్రపంచకప్ సమయానికి చెప్పుకోదగిన కోచ్ లేకుండా, ఒక దేశవాళీ కోచ్ ను వెంట తీసుకెళ్లి టీమిండియా విజేతగా నిలవడంలో కోచ్ పాత్రకు ఉన్న నిర్వచనాలు మారిపోయాయి. చాన్నాళ్ల పాటు కోచ్ ఎవరనేది ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆ తర్వాత గ్యారీ క్రిస్టెన్ తెర మీదకు వచ్చి ఇండియన్స్ కు నచ్చిన మరో విదేశీ కోచ్ గా నిలిచి వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ కోచ్ పాత్రలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. అయితే బీసీసీఐ కోచ్ కు భారీ పారితోషికం చెల్లించే అవకాశం ఉండటం, ఆ రోల్ లో ఎవరో ఒకరు ఉండక తప్పని పరిస్థితుల్లో.. అనేక మంది మాజీలు ఆ హోదాపై కన్నేశారు.
కోచ్ గా రవిశాస్త్రి శకం కొన్నాళ్లు నడిచింది. ఆతర్వాత కుంబ్లే, మళ్లీ రవిశాస్త్రే కావాలనే పట్టు.. ఇలాంటి వ్యవహారాలే ఎక్కువ నడిచాయి. అంతే కానీ.. ప్రత్యేకత చాటుకున్న కోచ్ లేమీ లేరు. మొదట్లో ఒకరే కోచ్. ఆతర్వాత బ్యాటింగ్ కోచ్, ఆ పై బౌలింగ్ కోచ్, ఆ పై ఫీల్డింగ్ కోచ్.. ఇలా ప్యాకేజీ వచ్చి చేరింది. కొత్త కోచ్ రావడంతోనే ఈ ప్యాకేజేంతా మారేది! ఇలాంటి పాత్రలు ఎక్కువ కావడంతో కోచ్ హోదాకు స్థాయి తగ్గిపోయింది.
ఇప్పుడు ఒక కోపధారి మనిషి గంభీర్ కోచ్ పాత్రకు ఏ మేరకు ఫిట్ అవుతాడనేది ఆసక్తిదాయకమైన అంశం. మైదానంలో ఆడుతున్న రోజుల్లో ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనే వాడు గంభీర్. పేరకు తగ్గట్టుగా వ్యవహరించేవాడు. అయితే ఆట అయిపోయిన తర్వాత.. స్వదేశీ క్రికెటర్లతో కూడా ఆయన ఢీ అన్నాడు. గంభీర్- కొహ్లీల గొడవ సుదీర్ఘకాలం నాటిదే.
ఇక 2011 ప్రపంచకప్ విజయంలో ఎక్కువ క్రెడిట్ ధోనీకి వెళ్లిపోయిందని, తనకు పెద్ద గుర్తింపు రాలేదనే బాధేదో గంభీర్ కు ఉన్నట్టుంది. ఈ విషయాన్ని డైరెక్టుగా చెప్పకుండా యువరాజ్, జహీర్ వంటి వారి పేర్లను ప్రస్తావించి గంభీర్ మాట్లాడాడు. క్రికెట్ అనేది టీమ్ గేమ్ నిస్సందేహంగా. ఏ ఒక్కరితోనో విజయం దక్కదు, పరాజయం ఎదురు కాదు. అయితే కొందరికి రావాల్సిన దానికన్నా ఎక్కువగుర్తింపు వస్తుంది, మరికొందరికి రాదంతే! మరి కొందరికి ఎంత టాలెంట్ ఉన్నా అవకాశాలే రావు! అవకాశం రావడమే గొప్ప గుర్తింపు కోసం యాచించరాదు!
ఐపీఎల్ లో గంభీర్ కు కోచ్ గా అనుభవం ఉందట! బీజేపీ ఎంపీగా పని చేసిన అనుభవం కూడా గంభీర్ ఉంది. అయితే ఎంపీగా పనితీరుకు భయపడి రెండోసారి పోటీ చేయలేదు. మరి ఇప్పుడు కోచ్ గా ఈయన తన మార్కును ఏ మేరకు చూపుతాడో! ఇకపై డ్రస్సింగ్ రూమ్ వైపు కెమెరాలు ఎక్కువగా తిరగొచ్చు!
-హిమ