సోషల్ పాతాళాల్లో భ్రష్ట మీడియా

మీడియా లేదా జర్నలిజం యొక్క నిర్వచనం రకరకాలుగా రూపు మార్చుకుంటూ వచ్చింది. తొట్టతొలుత అది ‘పెట్టుబడిదారీ మీడియా’ గా ఒక రూపం సంతరించుకుంది. తర్వాత్తర్వాత మీడియా అనే పదానికి అనేకానేక ప్రిఫిక్సులు అనివార్యంగా వచ్చి…

మీడియా లేదా జర్నలిజం యొక్క నిర్వచనం రకరకాలుగా రూపు మార్చుకుంటూ వచ్చింది. తొట్టతొలుత అది ‘పెట్టుబడిదారీ మీడియా’ గా ఒక రూపం సంతరించుకుంది. తర్వాత్తర్వాత మీడియా అనే పదానికి అనేకానేక ప్రిఫిక్సులు అనివార్యంగా వచ్చి చేరిపోయాయి. కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాలు.. ఇంటర్నెట్ రంగం, మొబైల్ ఫోన్లు అన్నీ కూడా మీడియా కొత్తరూపాలు సంతరించుకోవడంలో ప్రధాన భూమిక పోషించాయి. ఆన్ లైన్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ కొత్తరూపాలు. మీడియా అనేది ఎంత గౌరవప్రదమైనదో ఆ పాత్రను ఈ కొత్తరూపాలు అన్నీ కూడా.. అదేవిధంగా ఆ గౌరవాన్ని కాపాడే రూపాలుగానే తొలుత రూపొందాయి. కాలక్రమంలో అందులో భ్రష్ట రూపాలు కూడా మొదలయ్యాయి. ఈ భ్రష్టత్వం అనేది ఇతర మీడియాల్లోకి కూడా విస్తరించడం మొదలైంది.

ఇవాళ కేవలం సోషల్ మీడియాను మాత్రం నిందించే పరిస్థితి లేదు. అన్ని రకాల మీడియాల్లోనూ అదే భ్రష్టత్వం తాండవిస్తోంది. ఒకరిని చూసి ఒకరు భ్రష్టత్వంలో విశృంఖలత్వానికి తెబడుతున్నారు.  సమాజాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్న ఈ పోకడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘సోషల్ పాతాళాల్లో భ్రష్ట మీడియా’!

ఇలాంటి సందర్భాల్లో పాతరోజులను గుర్తు చేసుకోవాలని అనిపిస్తుంది. పాతరోజుల్లో అయితే.. పల్లెలో నలుగురూ రచ్చబండ దగ్గర కూర్చునే వాళ్లు.. దేశరాజకీయాలు మాత్రమే కాదు.. అంతర్జాతీయ రాజకీయాల వరకు విచ్చలవిడిగా మాట్లాడేసుకునేవాళ్లు! టవున్లలో అయితే ఏ టీ బంకుల దగ్గరో ఇదే వ్యవహారం నడుస్తూ ఉండేది. అదే తరహాలో ఏ మునిసిపల్ కుళాయి దగ్గరో, నీటికోసం బావి వద్ద వేచి ఉన్నప్పుడో, మధ్యాహ్నం వేళ ఆడవాళ్లందరూ కలిసి ముచ్చట్లు పెట్టేవాళ్లు. వంటల దగ్గరినుంచి ఊర్లో ఎవరెవరి ఇళ్లలో ఏం జరిగిందో, ఆ మూలాల్లోంచి సకల సామాజిక పరిణామాలను, పర్యవసానాలను కూడా చర్చించేస్తూ.. తమ తమ విలువైన తీర్మానాలు చేస్తుండేవాళ్లు!

ఇప్పుడు లోకం పోకడ మారింది. మాట్లాడుకోవడానికి ఏ నలుగురూ కలవాల్సిన అవసరం లేదు. అలాగే తమ తీర్మానాలను ఆ గుంపులో రావిచెట్టు కింద రచ్చబండ మీదనో, పెరటి వసారా నీడలోనో గుమికూడిన ఆ నలుగురైదుగురికి మాత్రమే పరిమితం చేయాల్సిన అవసరం కూడా లేదు. నీలో నువ్వు మాట్లాడుకోగలిగితేచాలు.. నీతో నువ్వు మాట్లాడుకోగలిగితే చాలు.. ఎదురుగా ఒక ఫోను పెట్టుకుని- యథేచ్ఛగా నీకు తోచినెదెల్లా మాట్లాడేసుకోవడం కూడా కుదురుతుంది.

దీనివల్ల ఒక లాభం కూడా ఉంటుంది. ఎదురుగా మరో మనిషితో మాట్లాడుతోంటే.. కొన్ని మొహమాటాలు.. ఎదుటివాడు ఏం అనుకుంటాడో అనే సంకోచాలు మనల్ని వెనక్కు లాగుతాయి. ఈ ఫోనుతో మాట్లాడడం వల్ల అవేమీ ఉండవు. విచ్చలవిడిగా చెలరేగిపోవచ్చు. యథేచ్ఛగా సోషల్ మీడియాలో పోస్టు చేసేయవచ్చు. ఎవరు చూసుకుంటారనేది మనకు అనవసరం.. మన బుర్రలో ఉన్న విషాన్ని సమాజం మీద కక్కేశామా లేదా అనేదొక్కటే ప్రయారిటీ! ఇలాంటి దుర్మారర్గమైన పోకడలకు ఆలవాలమైనదే సోషల్ మీడియా!

వైరల్ అనేది ఒక వెర్రి!

మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియా ఒక అద్భుతమైన సాధనం. అలాగే మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి మన జ్ఞానాన్ని అప్ డేట్ చేసుకోవడానికి కూడా.. సోషల్ మీడియా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ సోషల్ మీడియాలో తమ ఆదరణ అనేది లైకులమీద, షేర్ల మీద ఆదారపడి ఉంటున్న సమాజంలో.. తాము పాపులర్ అని తమ ఈగోను సంతృప్తి పరచుకోవడానికి ప్రతి ఒక్కరూ లైకులు టార్గెట్ గా వీడియోలు చేయడం మనం గమనిస్తున్నాం.

బాగా పాపులర్ కావడం అంటే వైరల్ కావడం. వైరల్ కావడం అనేది సోషల్ వేదికల మీద ఉన్న వారి బుర్రలను తొలిచేసే విషపు పురుగు. ఈ పురుగు తొలుస్తూ ఉన్నంతకాలం.. వైరల్ వీడియోలు, వైరల్ రీల్స్ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాంటివి చేసే ప్రయత్నంలో కొండ అంచులకు వెళ్లి, రైళ్ల సమీపానికి వెళ్లి, నదుల ప్రవాహాల వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఘటనలు మనం వందల సంఖ్యలో గమనిస్తూనే ఉన్నాం. వైరల్ కావడం కోసం అనేక తప్పుడు పోస్టులను, వీడియోలను చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. 

మెయిన్ స్ట్రీమ్ కు ఏం ఖర్మ!

వైరల్ అనే పదాన్ని మనం సోషల్ మీడియాకు పరిమితమైన వ్యవహారంగా చూస్తున్నాం. అలా మాట్లాడుతున్నాం. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు, చానెళ్లు అంతకంటె నీచంగా ప్రవర్తిస్తున్నాయి. వారికి కూడా వైరల్ కావాలనే కక్కుర్తి ఎక్కువ. అందుకోసం వైరల్ అయిన వీడియోలను, తమ తమ చానెళ్లలో ప్రత్యేక కార్యక్రమాలుగా రూపొందిస్తుంటారు. కొన్ని సరదాగా ఉండే వీడియోలు ఉంటాయి. కానీ మెజారిటీ అపభ్రంశపు వీడియోలే. నిజానికి వైరల్ కార్యక్రమాలు చేసే చానెళ్లు.. ఆ కార్యక్రమాల్లో సరదా వైరల్ వీడియోలను ఎక్కువగా చూపిస్తాయి. కానీ ఖర్మం ఏంటంటే.. ఒక తప్పుడు వీడియో దొరికిందంటే.. దాని మీద వందల గంటల స్క్రీన్ అవర్స్ ను వారు ప్రసారాలతో నింపేస్తారు. చర్చలు పెట్టి.. ఆ చెత్త వీడియోను వందల సార్లు చూపిస్తూ పైశాచికానందం పొందుతారు.

ప్రణీత్ హన్మంతు మీద ఎన్ని గంటల ప్రసారాలు ఒక్కోరోజులు వస్తున్నాయో గమనిస్తే మనకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న‌ హీరో.. ఒకమ్మాయితో సుదీర్ఘకాలంగా అక్రమసంబంధం కొనసాగిస్తూ ఉంటే.. (దానికి రిలేషన్ షిప్ లో ఉండడం అనే అందమైన పేరు కూడా), మధ్యలో మరో అమ్మాయిని తన శృంగార భాగస్వామిగా ఎంచుకుంటే దాని మీద ఎన్నివందల గంటల ప్రసారాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం.

ఇందులో సమాజానికి ఉపయోగపడేది గానీ.. సమాజం నేర్చుకోవాల్సింది గానీ.. వారికి అవసరమైన సమాచారంగా గానీ భావించవలసినది ఏమైనా ఉందా? అనేది సందేహం. సోషల్ మీడియాను నిందించే ముందు.. అసలు వాటిని నెత్తిన పెట్టుకుని ఊరేగే మెయిన్ స్ట్రీమ్ మీడియా వివేకం ఎంత పనిచేస్తోంది అని కూడా ఆలోచించాలి.  

నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో ఉండదా?

సోషల్ మీడియా వెర్రితలలు వేయడం పట్ల  కేంద్రప్రభుత్వం నియంత్రణ చర్యలుండాలి. తప్పుడు వ్యక్తుల మీద ఆజమాయిషీ ఉండాలి. సోషల్ మీడియాలో అనే ముసుగులో అనేక రూపాలు ఉన్నాయి. వాటన్నింటినీ నిత్యం పరిశీలిస్తూ వెర్రితలలు వేస్తున్న వాటిని గమనించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తప్పుడు వ్యక్తులు పెట్టే తప్పుడు వ్యవహారాలు, తప్పుడు పోస్టులను శాశ్వతంగా పరిహరించే ప్రయత్నాలు జరగాలి. ఇలాంటి పోస్టులు పెట్టే వారికి హెచ్చరికలు పంపే వ్యవస్థ ఉండాలి.

నిర్దిష్టంగా పదేపదే హెచ్చరికలు పంపిన తర్వాత కూడా అలాంటి తప్పుడు పోస్టులు పెడుతూ, సమాజంపై విషం చిమ్ముతూ ఉంటే గనుక.. వారి సోషల్ మీడియా ఖాతాలను కూడా స్తంభింపజేయాలి. తప్పుడు వెబ్ సైట్లు, అనామకంగా నడిచే వెబ్ సైట్లు, రహస్యంగా ముసుగులో ఉండి నడిపే వ్యవహారాలు ఇలాంటి వాటి మీద కేంద్రం ప్రభుత్వం ప్రాథమికగా నిఘానేత్రం ఉంచాలి. తప్పులు దొరికినప్పుడు మూడోనేత్రం తెరవాలి.

ఇవాళ ఉన్న సాంకేతిక విప్లవం, ఆధునిక సాంకేతిక పోకడల నేపథ్యంలో తప్పులు చేసే వారిని గుర్తిస్తే చాలు.. వారి ఖాతాలను స్తంభింపజేయడం అనేది చిటికెలో పని. అందుకు కేంద్రప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోతే గనుక.. ఇలాంటి దుర్మార్గాలు మళ్లీ మళ్లీ వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అవి సమాజం మీద దుష్ప్రభావం చూపిస్తున్నాయంటూ వగచి విచారించడం, టీవీ ఛానెళ్లలో చర్చలు పెట్టుకోవడం తప్ప ఇంకో ఉపయోగం ఉండదు.

ఎవడు నీచుడు?

కొన్ని విషయాల్లో ఎవడు నీచుడు అనేది ఇదమిత్థంగా నిర్ణయించడం కూడా.. చెట్టు ముందా? విత్తు ముందా? అనే తరహా మీమాంస అవుతుంది. ఇటీవల ఒక స్నేహితురాలు ఒక ముచ్చట నాతో పంచుకుంది.

ఆమె మధ్యతరగతి గృహిణి. విద్యావంతురాలు. ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంది. ఆమె రోజువారీ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్లు ఫాలో అయ్యే మహిళ కాదు. పగలు ఖాళీ సమయంలో ఆమె ప్రధాన వ్యాపకం టీవీలో యూట్యూబ్ ఓపెన్ చేసుకుని వీడిలో చూడడం. ఆమె ఆసక్తులు ప్రధానంగా ఆధ్యాత్మిక విషయాలు, ఆలయ సందర్శన వంటి విషయాలు చుట్టూ మాత్రమే తిరుగుతుంటాయి. చూసే వీడియోలన్నీ అలాంటివే.

మంచో చెడో.. ఆధ్యాత్మికమూ ధర్మమూ అనే పేరు పెట్టి దారిన పోయే ప్రతివాడూ కాస్త అటువంటి గెటప్ తగిలించుకుని చేసే ఫోన్ మేడ్ వీడియోలు అన్నీ కూడా చూస్తుంటుంది. అందరి ఛానెల్స్ సబ్‌స్క్రయిబ్ చేసి చూస్తుంటుంది. అలాంటి వారిలో ఒక గుండు చేయించుకున్న, కాస్త లేత పసుపు లాల్చీతో మీడియం సైజు రుద్రాక్ష మాలతో ఆకర్షణీయమైన.. భవిష్యత్తులో స్వామీజీ అవతారం ఎత్తదలచుకున్న వ్యక్తి కూడా ఒకరున్నారు. అలవాటుగా ఆయన చేసిన ఒక వీడియోను ఆమె ఓపెన్ చేసింది.

అప్పటిదాకా.. ఆమెకు ప్రణీత్ హనుమంతు అంటే ఎవరో తెలియదు.  వాడు చేసిన వీడియో ఆమె యూట్యూబ్ రికమెండేషన్స్ లో కూడా ఎక్కడా తగల్లేదు. అయితే ఈ గుండు స్వామి వీడియోను ఓపెన్ చేయగానే.. సదరు ప్రణీత్ హన్మంతు చేసిన వివాదాస్పద వీడియో మొత్తం ప్లే అయింది. ఆ దుర్భాష, దరిద్రం మొత్తాన్ని ఆమె వీక్షించింది. అదంతా పూర్తయిన తర్వాత స్వామి తెరమీదకు వచ్చి.. ‘‘ఇప్పటిదాకా చూశారు కదా..’’ అంటూ ప్రవీణ్ హన్మంతును దూషించడం ప్రారంభించాడు. వాడి వీడియో ఏ రకంగా తప్పుడు వీడియోనో వివరించడం ప్రారంభించాడు.

ఇప్పుడు ఆమెకు కలుగుతున్న సందేహం ఒక్కటే. ప్రవీణ్ హనుమంతు అనేవాడు నీచుడా? ఏ రకంగానూ వాడు చేసిన వీడియో చూసే అవకాశం కూడా లేని తన వంటి వేలాది మంది గృహిణులకు ఆ వీడియోను చూపించి.. ఆ తర్వాత తన ఉపదేశం ప్రారంభించిన, ఆ రకంగా ఆ తప్పుడు వీడియోను తనకు పరిచయం చేసిన ఈ స్వామీజీ నీచుడా? అనేది ఆమె సందేహం. నాక్కూడా అదే అనిపించింది. తాము చేసే వీడియోలకు వ్యూస్ పెంచుకోవడం కోసం.. వైరల్ అయిన నీచపు వీడియోలను పూర్తిగా చూపించి.. ఆ తర్వాత అవి నీచమైనవని వ్యాఖ్యానించే వారిని మనం ఇంతకంటె మరోలా ఎలా అర్థం చేసుకోగలం?

యూట్యూబ్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు..

యూట్యూబ్ అనేది ఇవాళ్టి రోజుల్లో ఒక అద్భుతం. యూట్యూబ్ చూసి వంటలు నేర్చుకుంటున్న వారు కోకొల్లలు. యూట్యూబ్ పుణ్యమా అని టూరిజం రంగం విపరీతంగా అభివృద్ధి చెందింది అంటే అతిశయోక్తి కానే కాదు. కేవలం యూట్యూబ్ లో పాఠాలు విని.. ఇల్లు కదలలేని స్థితిలో మంచం పట్టిన విద్యార్థి 60 శాతం మార్కులతో పాసైన సందర్భాలు కూడా నాకు తెలుసు.

కానీ చాలా మంది చెప్పే పోలికలాగానే.. యూట్యూబ్ పదునైన కత్తి లాంటిది. అలాంటి కత్తితో పండ్లు కోసుకుని తినవచ్చు. హత్యలు కూడా చేయవచ్చు. ఒక అద్భుతాన్ని ఎలా వాడుకుంటున్నాం అనేది మనమీద ఆధారపడి ఉంటుంది. యూట్యూబ్ చూస్తూ మెడికల్ జ్ఞానాన్ని పెంచుకుంటే మంచిదే. కానీ.. అదే యూట్యూబ్ ఆన్ చేసుకుని అక్కడ చూస్తూ ఇక్కడ ఆపరేషన్ టేబుల్  మీద పేషెంటుకు సర్జరీ చేస్తే ఎలా? ఇలాంటివి పెడపోకడలు.

అదే యూట్యూబ్ లో అనేక అద్భుతమైన వీడియోలు ఉంటాయి. అలాగే అపభ్రంశమైనవి అంతకంటె ఎక్కువగానే ఉంటాయి. ఇవాళ్టి రోజుల్లో ఎవడి చేతిలో ఒక స్మార్ట్ ఫోను ఉన్నా చాలు.. వాడు యూట్యూబర్ అవతారం ఎత్తినట్టే. ప్రణీత్ హన్మంతు లాంటి నీచులకు కూడా యూట్యూబ్లో బోలెడంత స్పేస్ ఉంటుంది. పైగా ఫాలోవర్లు కూడా బుద్ధిని బట్టి, భావజాలాన్ని బట్టి జతచేరుతారు. తప్పుడు సంగతులు సహజంగానే ఎక్కువమందిని ఆకర్షిస్తుంటాయి. అయితే ఇలాంటి తప్పుడు చానెళ్లను నియంత్రించలేమా?

పత్రికలు నడపాలంటే, ప్రారంభించాలంటే ఒక నిర్దిష్టమైన నమూనాలో ప్రభుత్వపు అనుమతి అవసరం. వెబ్ సైట్ల నిర్వహణకు కూడా కొన్ని విధివిధానాలు రూపొందుతున్నాయి. ప్రభుత్వం అజమాయిషీ పెరుగుతోంది. అయితే యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలకు అదేం లేదు. కేంద్రం తలచుకుంటే అలాంటి ఏర్పాటు పెట్టడం సాధ్యం కాదా? అనేది గమనించాలి.

జీమెయిల్ ఉన్న ప్రతి ఒక్కడూ చానెల్ పెట్టుకునే వెసులుబాటు ఇవ్వకుండా, అందుకు కొన్ని విధివిధానాలు నిర్ణయించేలా.. కనీసం ఆధార్ తో అనుసంధానం అయ్యేలా కొన్ని ఏర్పాట్లను కేంద్రం యూట్యూబ్ కు సూచించాలి. తమ నిబంధనలు ఫాలో అయితే మాత్రమే మా దేశంలో అనుమతిస్తాం అంటే.. వారే దిగివస్తారు. అలాంటప్పుడు యూట్యూబ్ దిగివచ్చి కేంద్రం చెప్పినట్టు ఉంటుంది.

తమ ఆధార్ ద్వారా తమ ఐడెంటిటీ మీద నిఘా ఉన్నదని, అది రహస్యం కాదని తెలిసినప్పుడు.. పోస్టులు పెట్టేవారికి భయం, బాధ్యత ఉంటాయి. అప్పటికీ దుర్మార్గపు పోస్టులు వెల్లువెత్తితే గనుక.. సదరు ఆధార్ తో లింక్ అయి ఉన్న వారి మీద చర్యలు తీసుకోవచ్చు. వారి ఇతర సోషల్ మీడియా ఖాతాలు అన్నింటినీ స్తంభింపజేయవచ్చు. ఇలాంటి నిషేధాలు నిత్యమూ సాగే కసరత్తుగా ఉండాలి.

ఇలాంటి చర్యలు తమ స్వేచ్ఛను హరించేవిగా ఎవ్వరూ భావించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది సమాజాన్ని పెడదారి పట్టించడానికి, సమాజం మీద విషం కక్కడానికి కాదు. ఆ స్పృహ అందరికీ ఏర్పడితే తప్పుడు పోస్టులు సోషల్ ముసుగులో భ్రష్టాచారాలు తగ్గుతాయి. ఆగిపోతాయని అనలేం. అప్పుడప్పుడూ కనిపించే వాటిమీద ఎప్పటికప్పుడు కొరడా ఝుళిపిస్తూ పోతే కొంతకాలానికి మంచి మాత్రమే మిగులుతుంది. సమాజానికి మంచి జరుగుతుంది.

..ఎల్. విజయలక్ష్మి