దేశానికంతా ఒక రూల్, ఏపీకి మాత్రం మరొకటి అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదెక్కడి విడ్డూరమంటూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్‌పై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే వుండి, పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. రాజకీయ పక్షాలను సీఈసీ వైఖరి విస్మయపరిచింది.
ఈ నేపథ్యంలో సీఈసీ ఆర్వోలకు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వైసీపీ న్యాయ పోరాటానికి దిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీకి మాత్రమే ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ల చెల్లింపుపై ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని వైసీపీ తరపు న్యాయవాదులు గట్టిగా వాదించారు. సీఈసీ ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పైగా తన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో న్యాయ స్థానమే దిక్కని అధికార పార్టీ వెంటనే ఏపీ హైకోర్టును ఆశ్రయించింది.
సీఈసీ ఆదేశాలపై ఏపీ హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. సీఈసీ ఆదేశాలను ఏపీ హైకోర్టు సమర్థిస్తుందా? లేక దేశ వ్యాప్తంగా వర్తించినట్టే, ఇక్కడా అవే నిబంధనలు పాటించాలని తీర్పు ఇస్తుందా? అనేది సాయంత్రానికి తేలనుంది. పోస్టల్ బ్యాలెట్లపై టీడీపీ కోరినట్టుగానే సీఈసీ సడలింపు ఇవ్వడం వివాదాస్పదమైంది. అందుకే న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చిందని వైసీపీ చెబుతోంది.
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ఇక ఎన్నికల లెక్కింపునకు కౌంట్‌డౌన్ మొదలైంది. దీంతో పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు తీర్పు ఏపీలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోందని చెప్పొచ్చు.