ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టులో కుటుంబ సభ్యులతో సహా ఆయన దిగారు. ఎన్నికలు ముగిసిన అనంతరం గత నెల 17వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విదేశీ పర్యటనకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి పలు దేశాలకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.
రెండు వారాల విదేశీ పర్యటనను జగన్ దిగ్విజయంగా ముగించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన తాడేపల్లిలోని తన ఇంటికి చేరుకున్నారు.
మరో రెండు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జగన్ తిరిగి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కౌంటింగ్ కేంద్రంలో అనుసరించాల్సిన విధానంపై పార్టీ నాయకులు, ఏజెంట్లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు తమ పార్టీ ఏజెంట్లకు కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కోర్టు తీర్పుపై వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఏపీ హైకోర్టు తీర్పును అనుసరించి పోస్టల్ బ్యాలెట్లపై ఏజెంట్లపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇదిలా వుండగా జగన్ విదేశీ పర్యటనకు వెళ్లే సందర్భంలో గెలుపుపై ధీమా ఇచ్చిన సంగతి తెలిసిందే.