ఒక జిల్లానుంచి ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలంటే.. ఏ ముఖ్యమంత్రికైనా క్లిష్టంగానే ఉంటుంది. ఆ దురవస్తను తప్పించుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో.. ఒక జిల్లాలో ఒక సామాజికవర్గం నుంచి ఇద్దరు బలమైన నాయకులు ఉంటే.. ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకుంటూ ఉంటారు. వారిలోని పదవీకాంక్ష, అది దక్కదేమో అన్న అభద్రత భావం ఇలా చేయిస్తుంది.
ఇది కూడా సహజం. అయితే.. కులాల లెక్కల మీదినుంచి చూసినప్పుడు అందరి పరిస్థితి వేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి వేరు. ఎవరికి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా.. ముఖ్యమంత్రి జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం పదవి ఇవ్వడం గ్యారంటీ. అయినా సరే.. ఆయన ఎందుకు తన జిల్లాలోని మరో మంత్రి రోజాను టార్గెట్ చేస్తుంటారో అర్థం కాని సంగతి.
చిత్తూరు జిల్లాలోని ఈ ఇద్దరు మంత్రులకు మధ్య పొసగదనే సంగతి అందరికీ తెలుసు. సహజంగానే.. కాంగ్రెసు పార్టీలో ఉన్న నాటినుంచి చిత్తూరుజిల్లాకు పెద్దదిక్కు సీనియర్ నాయకుడైన పెద్దిరెడ్డికి జిల్లా అంతటా విస్తృతమైన పరిచయాలు, అనుచరగణం ఉన్నారు. నగరి నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి గ్రూపు వైసీపీ నాయకులు రోజాకు కొరుకుడుపడడం లేదు. ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు. ఏ కార్యక్రమాన్ని కూడా సజావుగా సాగనివ్వరు. తగాదా పెట్టుకుంటారు.
తాజాగా నగరి నియోజకవవర్గం వడమాటలపేటలోని ఓ పంచాయతీ భవనాన్ని ప్రారంభించాలని అనుకుంటే.. స్థానిక జడ్పీటీసీ అయిన పెద్దిరెడ్డి గ్రూపు నాయకుడు అడ్డు పడ్డాడు. ఇంకా బిల్లులు 23 లక్షలు పెండింగ్ ఉండగా అప్పుడే ఎందుకు ప్రారంభించాలంటూ అడ్డుకున్నాడు. అసలు బిల్లులు పెండింగ్ లో ఉంటే భవనమే ప్రారంభించకూడాదని అనుకుంటే.. రాష్ట్రంలో సగం భవనాలు అలా శిథిలమే అయిపోతాయేమో..? అలా రచ్చచేసి ఏకంగా తలుపు తాళం వేసుకుని వెళ్లాడు.
ప్రారంభించాల్సి వస్తే.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఆహ్వానించాలనేది అతని డిమాండ్. పాపం.. రోజా.. ఏదో పోలీసుల సహాయంతో మొత్తానికి ఆ ప్రారంభోత్సవం అయిందనిపించారు.
ఇటీవల ఆమె జగన్ వద్ద కూడా తనకు నియోజకవర్గంలో ఎదురవుతున్న ముఠా తలనొప్పుల గురించి మొరపెట్టుకున్నారు. అయినా ఏమీ ప్రయోజనం ఉన్నట్టు లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పటికీ సేఫ్ జోన్ లో ఉండే నాయకుడు అయినప్పటికీ.. ఎందుకు రోజా మీదికి తన వర్గాన్ని ఎగదోస్తుంటారో తెలియదు. తాను ఎగదోయను అని తప్పించుకోజూసినా.. అసలు తన వర్గాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారో తెలియదు.