హోం మంత్రి అనితకు పోలీసులపై పట్టు లేదా?

ఇదే నెంబరు నుంచి గతంలో హోం మంత్రి అనితకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా పోలీసులు వెల్లడించారు.

సోమవారం నాడు ఒక తమాషా పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను చంపేస్తాం అని బెదిరిస్తూ ఆయన పేషీకి ఫోన్ కాల్స్ వచ్చాయి. విజయవాడకే చెందిన వ్యక్తి.. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ చేసినట్టుగా గుర్తించిన పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు.

ఇందులో తమాషా ఏముంది అని అనుకుంటున్నారా? ఇదే నెంబరు నుంచి గతంలో హోం మంత్రి అనితకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా పోలీసులు వెల్లడించారు. మరి ఈ ఆకతాయిని గతంలోనే ఎందుకు పట్టుకోలేకపోయారు? అనేదే తమాషా! హోం మంత్రి అనిత అంటే పోలీసులకు లెక్కలేదా, పోలీసు శాఖ మీద హోం మంత్రికి పట్టులేదా? ఆమెకు వచ్చిన బెదిరింపు కాల్స్ ను పోలీసులు లైట్ తీసుకున్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తోంది.

పవన్ కల్యాణ్ పేషీకి సోమవారం నాడు రెండు సార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి పేషీకి ఫోను చేసి చంపేస్తామని బెదిరించినట్టు, అభ్యంతరకర భాషలో మెసేజీలు పంపినట్టు పేషీలోని అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కు బెదిరింపు కాల్స్ రావడం గురించి హోం మంత్రి అనిత కూడా తీవ్రంగా స్పందించినట్టుగా.. ఆమె సీరియస్ అయి.. నిందితుడిని వెంటనే పట్టుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ప్రజా ప్రతినిధులపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారిని ఉపేక్షించరాదని హోం మంత్రి అనిత డీజీపీని ఆదేశించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

అయితే, బెదిరింపు కాల్ వచ్చిన నెంబరును ట్రేస్ చేసిన పోలీసులు విజయవాడ లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్ లో ఉంటున్న మల్లికార్జున్ గా గుర్తించారు. ఫోను నెంబరును బట్టి గాలింపు చేపట్టారు. సైబర్ క్రైం పోలీసులు ట్రాక్ చేయడంలో లబ్బిపేట నుంచే కాల్స్ వచ్చినట్టు తెలిసింది. పోలీసులు వెళ్లేసరికే నిందితుడు ఫోను స్విచాఫ్ కూడా చేసేశాడు. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదే వ్యక్తి గతంలో హోంమంత్రి అనితకు సైతం ఇదే నెంబరునుంచి బెదిరింపు కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారని వార్తలు వచ్చాయి.

అనితకు బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు ఇంత చురుగ్గా పోలీసులు ఎందుకు స్పందించలేదు. లైట్ తీసుకున్నారా? పవన్ కల్యాణ్ అంటే పోలీసుల్లో ఉన్న భక్తిప్రపత్తులు, హోంమంత్రి అనితపట్ల లేవా? అనే అనుమానం ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది.

4 Replies to “హోం మంత్రి అనితకు పోలీసులపై పట్టు లేదా?”

Comments are closed.