ఇటీవల కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద జనసేన నేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడ క్రిమినల్స్ కి అడ్డాగా మారిందని కామెంట్స్ చేశారు. దాని మీద రియాక్ట్ అయిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి నాతో ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడి విమర్శలు చేయాలి తప్ప కాకినాడ పేరుని దెబ్బ తీయవద్దు అని సూచించారు.
మరో అడుగు ముందుకేసి కాకినాడను కాపాడుకుందామని ద్వారంపూడి ప్రజలకు పిలుపు ఇచ్చారు. కాకినాడ ఇమేజ్ ని ఎవరు డ్యామేజ్ చేసినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు తొందరలొనే ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు.
ద్వారంపూడి కాకినాడ పేరు ప్రఖ్యాతులు రాజకీయ నేతల విమర్శల వల్ల పోకూడదు అంటూ ఉద్యమిస్తున్నారు. అదే విశాఖను తీసుకుంటే ఇప్పటికి అనేక సార్లు విశాఖ ఇమేజ్ ని దెబ్బతీశారు. విశాఖ నేరగాళ్ల అడ్డా అన్నారు విశాఖ సేఫెస్ట్ సిటీ కాదని అన్నారు.
కానీ విశాఖ ఆత్మ గౌరవం మీద ఎన్ని మరకలు పడుతున్నా ఎవరూ పట్టించుకోని దుస్థితి ఉందని ప్రజలు అంటున్నారు. దానికి కారణం విశాఖ సిటీలో ఎక్కువ మంది రాజకీయం చేసేది వలస నాయకులే. వారు ఎక్కడ నుంచో వ్యాపార వ్యవహారాల కోసం విశాఖ వచ్చి తమ రాజకీయాన్ని కొనసాగించారు.
విశాఖ ప్రశాంత నగరం, అయినా రాజకీయ నేతల స్వార్ధ ప్రయోజనాల కోసం మాటలు పడుతోంది. అలాంటి సందర్భంగా మంచి విశాఖ అంటూ ఉద్యమించే పక్కా లోకల్ లీడర్ ఎవరైనా ఉన్నారా అని వెతుకుతోంది. విశాఖ ఖ్యాతిని దెబ్బ తీసేల, ప్రగతి గతికి అడ్డం పడేలా అనేక డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ ఇప్పటికి చాలా మంది ఇచ్చినా విశాఖ మాత్రం నిబ్బరంగా ఉంది అంటే అది ప్రకృతి ఇచ్చిన బలమే అని చెప్పాలి.
హుదూద్ తుఫాన్ లో విశాఖ ఎలా తనను కాపాడుకుందో ఇపుడు రాజకీయ హుదూద్ తుఫాన్ని సైతం ఎదుర్కొంటోంది. నేతలు పార్టీలు ఎన్ని అయినా అనుకోవచ్చు, మహా నగరం మీద నిందలు వేయడమేంటి అన్న బాధ అయితే సగటు విశాఖ వాసిలో ఉంది. అందుకే విశాఖ ఆత్మ గౌరవ జెండా ఎత్తాలంటే ఒక ద్వారంపూడి ఇక్కడా కావాలేమో. లోకల్ లీడర్స్ కి రాజకీయ అధికారం ఇస్తేనే అది జరిగేది .