ఇంట్లో కూచోబెట్టేదాకా పెద్దాయన ఊరుకునేలా లేడే!

‘పదవికి రాజీనామా చేస్తా’ అనేది ఈ మధ్య కాలంలో నాయకులకు ఒక ఫ్యాషనబుల్ మాటగా మారిపోయింది. అందరూ అనేవాళ్లే తప్ప ఎవ్వరూ చేసేవాళ్లు మాత్రం ఉండరు. ఎవరైనా చేసినా.. అలా రాజీనామా చేయడం ద్వారా…

‘పదవికి రాజీనామా చేస్తా’ అనేది ఈ మధ్య కాలంలో నాయకులకు ఒక ఫ్యాషనబుల్ మాటగా మారిపోయింది. అందరూ అనేవాళ్లే తప్ప ఎవ్వరూ చేసేవాళ్లు మాత్రం ఉండరు. ఎవరైనా చేసినా.. అలా రాజీనామా చేయడం ద్వారా పొందగల లబ్ధి గురించి.. సవాలక్ష లెక్కలు వేసుకున్న తర్వాత మాత్రమే చేస్తారు. పైగా అలాంటి వాళ్లు.. నేను రాజీనామ చేస్తా అంటూ ప్రతిరోజూ డప్పు కొట్టుకుంటూ బతకరు. 

కానీ ఉత్తరాంధ్రకు చెందిన ఈ నాయకుడు మాత్రం.. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట కాస్త మైకు దొరికితే చాలు.. నేను రాజీనామా చేస్తా అని పాట పాడుతూ ఉంటారు. ఒకరోజు ఉత్తరాంధ్ర కోసం రాజీనామా చేస్తా అంటారు. అసలు నాకు ఎమ్మెల్యే పదవి కూడా వద్దు.. కేవలం ఉత్తరాంధ్ర బాగుపడడం కోసం పోరాటంలో మాత్రమే ఉంటా అని సెలవిస్తారు. మరో రోజు ముఖ్యమంత్రి జగన్ ఒప్పుకుంటే.. ఈ క్షణంలో మంత్రి పదవికి రాజీనామా చేసేస్తా అని అంటారు. 

అక్కడికేదో ఈ మంత్రిగారి మాటలు వింటే.. జగన్మోహన్ రెడ్డి ఆయనను బతిమాలి, బామాలి.. ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కుని.. నీబోటి పెద్దల మార్గదర్శనం లేకపోతే మేం అనాథలు అయిపోతాం అని నచ్చజెప్పి.. ఆయనను కేబినెట్లో కూర్చోబెట్టినట్టుగా చూస్తున్న వాళ్లకి అనిపిస్తుంది. 

నిజానికి మంత్రిగా ఆయన సేవలు పొందే తాహతు తమకు లేదనే సత్యం ఎరిగిన వాడు గనుక.. ముఖ్యమంత్రి తొలివిడతలో ఆయనను ఎమ్మెల్యేగిరీకి మాత్రమే పరిమితం చేశారు. ఈ పెద్దాయనకు కోపం వచ్చింది. అసలే ఈ రాష్ట్రంలో నా అంతటి వాడు లేడు.. నన్నే ఇంటికి పరిమితం చేస్తారా? అని అలిగారు. అంటీముట్టనట్టుగా ఉంటూ వచ్చారు. నలుగురిలో మాట్లాడే ఏ సందర్భం వచ్చినా.. వైరాగ్యం ప్రదర్శిస్తూ ఉండేవారు. 

ఆయన విలాపాలు చూడలేకపోతున్నట్టుగా, పోనీ పాపం అన్నట్టుగా జగన్ పునర్ వ్యవస్థీకరణలో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. కోరుకున్న పదవి దక్కింది. కానీ, అప్పటినుంచి పాట మారింది. నేను రాజీనామా చేస్తా.. సన్యాసం తీసుకుంటా లాంటి డైలాగులు ఎక్కువయ్యాయి. 

లీగల్ దొరికేంత తప్పులు ఉండకపోవచ్చు గానీ.. అవినీతి అంటే అందులో ఎన్ని అక్షరాలుంటాయో, స్పెల్లింగేమిటో తెలియనంత పరిశుద్ధాత్మ స్వరూపుడేమో కాదు ఈ పెద్దాయన. అయితే.. నా అవినీతిని వేలెత్తి చూపిస్తే రాజకీయాలే వదిలేస్తా అని కొత్త శపథాలు చేస్తున్నారు. 

ఇలా ప్రతిరోజూ రాజీనామాల గురించి చెబుతూ ఉంటే.. అసలు ఈయనకు ఈ విడతతో రాజకీయం మానుకుని, వారసుల్ని రంగప్రవేశం చేయించాలనే కోరిక ఉన్నదా అనే అనుమానం కలుగుతుంది. అందుకే ఈ సన్యాసం డైలాగులు వేస్తున్నారా అనేది కొందరి అభిప్రాయం. అయినా.. ప్రతిరోజూ రాజీనామా జపం చేస్తూ ఉంటే.. ఏదో ఒక రూపంలో అదే ప్రాప్తిస్తుందేమో.. తథాస్తు దేవతలుంటారని ఆ అరవైనాలుగేళ్ల పెద్దాయన తెలుసుకోవాలి.