వైసీపీ మంత్రుల స్థితి ఎట్లా వుందంటే బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ డైలాగ్ ఒకటి వుంటుంది. “అంతా మీరే చేశారు” అని.
ఆ రకంగా ఏం జరిగినా అంతా టీడీపీనే చేసిందంటారు. మీరు వచ్చి మూడేళ్లైంది, ఇంకా ఈనాడుని, టీడీపీని నిందిస్తూ కూచుంటే జనం నవ్వుకుంటున్నారు. రోడ్డు అంటే అర్థం ఏంటి? ప్రతిరోజూ వేల మంది జనం, వాహనాలు తిరిగే స్థలం. అది గతుకులు, గుంతలు లేకుండా వుండాలి. దానికి ప్రతి సంవత్సరం మరమ్మతులు లేదా తిరిగి వేయడం జరగాలి. ఆ రోడ్డు మీద తిరిగే మనుషులు, వాహనాలు (యజమానులు) ప్రభుత్వానికి పన్నులు కడతారు. దానికి బదులుగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలి. ఇది జనరల్ ప్రొసీజర్.
ఈనాడులో రోడ్ల దుస్థితిపై వార్తలొచ్చాయి. దాంతో విశాఖలో, కడపలో ఉప ముఖ్యమంత్రులు ముత్యాలనాయుడు, అంజాద్‌బాషాలకు కోపం వచ్చింది. వెంటనే రొటీన్ డైలాగ్ అందుకున్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జీవీఎంసీ పరిధిలోని రహదారులన్నీ దెబ్బతిన్నాయట. అప్పుడు మాత్రం పచ్చ పత్రికలు వార్తలు రాయలేదట. రాయకపోతే వాళ్ల ఇష్టం. వాళ్ల పత్రికలు ఏమైనా రాసుకుంటాయి. మధ్యలో మీదేం పోయింది. రాయడానికి సాక్షి వుంది కదా?
అయితే ఈనాడు వేసింది పాత ఫొటోలట, సోషల్ మీడియాలో ఈకకి ఈక పీకి రాసే ఈ రోజుల్లో ఈనాడు పాత ఫొటోలు వేసే సాహసం చేస్తుందా? చేస్తే ఏది నిజం? సాక్షిలో కుమ్మేయరా?
వార్తల సంగతి పక్కన పెడదాం. మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్లైంది. తెలుగుదేశం వాళ్లు పాడు చేసిన రోడ్లని సరి చేయడానికి టైమ్ సరిపోలేదా?
అల్లావుద్దీన్ అద్భుత దీపం మాదిరి రాత్రికి రాత్రి రోడ్లు వేయలేమని మంత్రి ముత్యాలనాయుడు అన్నారు. రాత్రికి రాత్రి ఎవరు వేయమన్నారు? మూడేళ్లకైనా వేయమంటున్నారు.
టీడీపీ హయాంలో 6900 గుంతలు, రహదారులు (వైజాగ్) వారసత్వంగా ఇచ్చారట. దీంట్లో 9 కోట్లతో 3200 గుంతలు పూడ్చారట. 3700 గుంతలు ఇంకా ఉన్నాయట. మంత్రి గారి మాటల్లో వైజాగ్ రోడ్లు సగం బాగు చేయడానికి మూడేళ్లు పట్టింది. మిగిలినవి త్వరలోనే చేస్తారు. రాజధాని చేస్తామన్న వైజాగ్ పరిస్థితి ఇది. కల్పితమేమీ లేదు. సాక్షిలో వచ్చిన వార్తే దీనికి సాక్ష్యం.
ఇక కడపలో అభివృద్ధి అద్భుతమని అంజాద్‌బాషా అన్నారు. ఈనాడు ఓర్వలేకుండా ఉందట. కడపలో 124 కోట్లతో రోడ్లని అభివృద్ధి చేస్తున్నారట. వైజాగ్‌లో గుంతలు పూడ్చడానికి ఏళ్లు పడితే, కడపలో మాత్రం అభివృద్ధి పరుగెత్తుతూ వుందట. ఈనాడు పూర్తికాని రోడ్ల ఫొటో తీసిందట.
రోడ్లు ఎలా వున్నాయో జనానికి తెలుసు. టీడీపీ, ఈనాడులని నిందిస్తూ టైమ్ పాస్ చేస్తే ఎవరికి నష్టం?