పర్వేజ్ ముషారఫ్ చావుబతుకుల మధ్య ఉన్నాడు. మృత్యువుకి ప్రజాస్వామ్యం ఎక్కువ. నియంతల్ని, క్రూరుల్ని, మహాత్ముల్ని, జ్ఞానుల్ని అందర్నీ సమానంగా చూస్తుంది. ముషారఫ్ మన దేశానికి ఒక పీడకల. కార్గిల్ యుద్ధాన్ని తెచ్చింది అతనే. అధికారికంగా 527 మంది చనిపోయి, 1,363 మంది గాయపడ్డారు.
1943లో ఢిల్లీలో ముషారఫ్ పుట్టాడు. స్వాతంత్ర్యం తర్వాత కుటుంబం పాకిస్తాన్ వెళ్లిపోయింది. ఆరేళ్ల వయసులో టర్కీ చేరుకున్నారు. చదువు అక్కడ సాగింది. సైన్యాధ్యక్షుడిగా చావుని ఎన్నోసార్లు తప్పించుకున్న ముషారఫ్, చిన్నప్పుడు మామిడి చెట్టు పైనుంచి కిందపడ్డాడు. చావు సమీపానికి వెళ్లడమంటే ఏంటో తనకి మొదటిసారి అర్థమైందని ఆత్మకథలో చెప్పుకున్నాడు. దాని పేరు In the line of fire – A Memoir.
ముషారఫ్‌కి కుక్కలంటే బాగా ఇష్టం. ఒక కుక్క పేరు విస్కీ. 1964లో సైన్యంలో చేరి ఆప్ఘన్ సివిల్ వార్, ఇండో -పాకిస్తాన్ వార్ (1965) లో పాల్గొన్నాడు. 1998లో ఆర్మీ జనరల్‌గా కార్గిల్ వార్ ప్లాన్ చేశాడు. 99లో ఆచరణలోకి వచ్చింది. యుద్ధంలో భ్రష్టు పట్టిన నవాజ్‌షరీఫ్ (ప్రధాని) ముషారఫ్‌ని తొలగించే ప్రయత్నం చేశాడు. దాంతో తిరుగుబాటు జరిగి ముషారఫ్ పాక్ అధ్యక్షుడయ్యాడు.
ట్రేడ్ యూనియన్లు రద్దు చేశాడు. మానవ హక్కుల మాటే లేదు. ఎందరో హత్యలకి గురయ్యారు, మాయమయ్యారు. జీవనం కష్టమైంది. అందరు నియంతలు చేసేదే ఇతను చేశాడు. అందరికీ జరిగిందే ఇతనికీ జరిగింది. 2008లో రాజీనామా చేసి లండన్ వెళ్లిపోయి స్వీయ బహిష్కరణ విధించుకున్నాడు.
2013లో మళ్లీ పాక్ వచ్చి ఎన్నికల్లో పాల్గొనాలని చూస్తే కోర్టు ఒప్పుకోలేదు. గెలిచిన నవాజ్ అనేక కేసులు పెట్టాడు. ముషారఫ్ పాక్‌లో లేకపోయినా మరణశిక్ష విధించారు. అయితే లాహోర్ కోర్టు దాన్ని తర్వాత రద్దు చేసింది.
ముషారఫ్‌కి అరుదైన వ్యాధి వచ్చింది. అవయవాలన్నీ ఒక్కొక్కటే పని చేయని స్థితి. కార్గిల్ యుద్ధంలో మంచుకొండల్లో పారిన రక్తం ఆరింది. కానీ కొడుకుల్ని పోగొట్టుకున్న తల్లుల కన్నీళ్లు ఆగలేదు.
ఇదంతా ఎందుకు చేశావని దేవుడు అడిగితే ముషారఫ్ ఏం చెబుతాడో!