వైసీపీ నేతల్ని ఆందోళనకు గురి చేసే క్రమంలో ఎల్లో మీడియా రాస్తున్న కథనాలు బూమరాంగ్ అవుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబునాయుడిని ఆరాధించే వీకెండ్ జర్నలిస్ట్ & మీడియాధిపతి పత్రికలో రాస్తున్న కథనాలు టీడీపీ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. చంద్రబాబుతో పాటు లోకేశ్‌ని అనుమానించే పరిస్థితులు…కేవలం ఈ మీడియా కథనాల వల్లే ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ అంతరంగాన్ని ఎల్లో మీడియా ప్రతిబింబిస్తుం టుందనే అభిప్రాయం వుండడమే ఇందుకు కారణం.
వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ ముఖ్య నేతలు కొన్ని రోజులుగా మైండ్ గేమ్‌కు తెరలేపారు. ఇందుకు తగ్గట్టుగా ఎల్లో మీడియా వాటికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇదిలా వుండగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో ఆ పార్టీలోకి వైసీపీ నుంచి చేరడానికి పోటీ పడుతున్నారనే వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఎల్లో మీడియా తన వంతు పాత్ర పోషిస్తోంది. అయితే ఇది కాస్త ఎక్కువై వికటించే ప్రమాదం కనిపిస్తోంది. అదెలాగంటే…ఇటు జనసేనతో పొత్తు వల్ల 25 సీట్లు, వైసీపీ నుంచి వచ్చే వారికి మరో 20 సీట్లు ఖాయంగా పోతాయనేది వీకెండ్స్ జర్నలిస్ట్ సార్ మీడియా కథనాల సారాంశం.
ఇదే టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారికి మింగుడు పడడం లేదు. ప్రతిపక్షంలో ఉంటూ, అధికార పార్టీ వేధింపులను ఎదుర్కొంటూ వస్తున్నామని, తీరా టికెట్ విషయానికి వచ్చే సరికి మొండిచేయి చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆందోళన నెలకుంది. ఇందుకు ప్రధాన కారణం ఎల్లో మీడియా కథనాలే అని వారు చెబుతున్నారు.
చంద్రబాబు మనసులో లేనిదే తమ అనుకూల మీడియా రాసే అవకాశం వుండదు కదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్థికంగా నష్టపోతూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్న తమను కాదని పొత్తు పేరుతోనూ, అలాగే వైసీపీ కాదనుకునే చెత్తను తెచ్చుకుని సీట్లు ఇస్తే… తాము ఊరుకునే ప్రశ్నే లేదనే హెచ్చరికలను పరోక్షంగా వారు పంపుతున్నారు.
ఎల్లో మీడియా కథనాలు వైసీపీ కంటే టీడీపీని ఎక్కువ భయాందోళనకు గురి చేస్తున్నాయనే వాస్తవాన్ని గ్రహించలేదని అంటున్నారు. ఎందుకంటే ఎల్లో మీడియా మైండ్ గేమ్‌ను వైసీపీ పట్టించుకునే దుస్థితిలో లేదని, జగన్ తాను చేయాలను కున్నది చేసి తీరుతారని, తమ నాయకుడిలా భయపడి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయరని టీడీపీ నేతలు చెబుతున్నారు.
వలస వచ్చే ఎమ్మెల్యేలు, అలాగే జనసేన నేతలకు కలిపి 45 నుంచి 50 టికెట్లు పోతే, ఆ స్థానాల్లో అంత వరకూ పార్టీని భుజాన మోసిన నాయకులు ప్రేక్షకపాత్ర పోషిస్తారని ఎలా అనుకుంటారనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. చివరికి తాను తీసిన గోతిలో టీడీపీ పడే ప్రమాదం పొంచి వుందనే టాక్ వినిపిస్తోంది.