నేను, నాది….ఇవి తప్ప చంద్రబాబు నోట మనది, టీడీపీది అనే మాటలు చాలా తక్కవ సార్లు దొర్లాయి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధవారం టీడీపీ 41వ ఆవిర్భావ సభలో చంద్రబాబు తనకు మాత్రమే సాధ్యమైన అతిశయోక్త ప్రసంగాన్ని చేశారు. ఈ భూమిని, మానవ సమాజాన్ని సృష్టించింది తానే అని చంద్రబాబు చెప్పడం ఒక్కటే తక్కువ. మాటకు ముందు, తర్వాత “నేను” అని పదేపదే చెప్పుకోవడం ద్వారా వ్యక్తిగత గొప్పలకు పోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు అంటేనే ఎచ్చులకు నిలువెత్తు విగ్రహం అనే పేరుంది. ఆ పేరుకు సార్థకత చేకూర్చేలా ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే అన్నింటికి తానే కారణమన్న చంద్రబాబు… నిజంగా ఆయనే కర్త, కర్మ, క్రియ అయిన దానికి మాత్రం చెప్పుకోకపోవడం ఇందులో ట్విస్ట్. దానిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలు చంద్రబాబును ఏ విషయంలో నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారో తెలుసుకునే ముందు…సభలో చంద్రబాబు స్వయంస్తుతి ఎలా సాగిందో ఆయన మాటల్లోనే…
“హైదరాబాద్‌కు దీటుగా మరో నగరం వస్తే తెలుగుజాతి గర్వపడుతుందని అమరావతి నిర్మాణం ప్రారంభించాను. అమరావతి నా కోసమా? నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌లో, హైటెక్ సిటీలో నేనేమైనా ఉద్యోగం చేస్తున్నానా?”
“హైదరాబాద్‌లో నేను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల్నీ, ప్రాజెక్టుల్నీ…నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా కొనసాగించారు. హైటెక్ సిటినీ నేను కట్టానని, వైఎస్ దాన్ని కూల్చేస్తే హైదరాబాద్ అభివృద్ధి జరిగేదా? జీనోమ్ వల్ల నాకు పేరు వస్తుందని, దాన్ని ఆపేసి వుంటే, ఈ రోజు కోవిడ్‌కు వ్యాక్సిన్ కనుగొనేవారమా?”
“ఈ రోజు శంషాబాద్ విమానాశ్రయాన్ని నేనే అభివృద్ధి చేశానని, ఔటర్‌రింగ్ రోడ్డు నా వల్లే వచ్చిందని ఎవరూ చెప్పకపోవచ్చు” “హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ పెట్టేందుకు పారిశ్రామికవేత్తల్ని ఇంటికి పిలిచి నేనే స్వయంగా వారికి ప్లేట్లు అందించి, అల్పాహారం వడ్డించాను”
“పేదల ఆదాయం 30-40 రెట్లు పెంచే బాధ్యత నాదే. స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం నుంచి 34 శాతానికి రిజర్వేషన్లు పెంచిన ఘనత నాదే. తెలుగుజాతి రుణం తీర్చుకుంటాను. ప్రపంచానికే ఒక నమూనా అందజేస్తా”
“ఔను, చంద్రబాబే ఈ సృష్టికి మూలం. అంతేనా, చంద్రబాబు గారు మీరు మరిచిన మీ ఘనత మరొకటి వుంది. దాని గురించి చెప్పాల్సిన బాధ్యత మాపై వుంది” అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మీకు ఉజ్వల రాజకీయ భవిష్యత్ ఇచ్చిన మహానాయకుడి రుణం తీర్చుకున్నారని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనత కూడా మీ ఖాతాలోకే చేరుతుందని నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. 1995లో ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి, అత్యంత అవమానకర రీతిలో పదవీచ్యుతుడిని చేసిన అల్లుడిగా, రాజకీయవేత్తగా మిమ్మల్ని తెలుగు సమాజం ఉన్నంత వరకూ గుర్తు పెట్టుకుంటుందనే కామెంట్స్‌తో ఆయన్ని చాకిరేవు పెడుతున్నారు. అతి ఎక్కువైతే, ఏదైనా రియాక్షన్ ఇలాగే వుంటుంది మరి!