ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వ్యతిరేకిస్తే చాలు…హంతకుడికైనా మద్దతు ఇవ్వడానికి ఎల్లో గ్యాంగ్ వెనుకాడడం లేదు. దీన్ని బట్టి వైఎస్ జగన్‌పై ఎల్లో టీమ్ ఎంతగా రగిలిపోతున్నదో అర్థం చేసుకోవచ్చు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో పచ్చదళం వైఖరి వింతగా వుంది. ఒకే సమయంలో ఇటు వైఎస్ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతకు, అటు తానే హత్య చేశానని మీసాలు తిప్పి చెబుతున్న దస్తగిరికి తెలుగుదేశం, ఆ పార్టీని మోస్తున్న ఎల్లో మీడియా మద్దతుగా నిలబడడం ఆసక్తికర పరిణామం.
వివేకాను తానే హత్య చేశానని దస్తగిరిని హీరో చేసే ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు హత్య కేసులో నిందితుల్ని నేరారోపణల్ని నిజం చేసేందుకు పోరాడుతున్న సునీతను ధీర వనితగా పాజిటివ్ కథనాలు రాయడం విశేషం. జగన్‌కు వ్యతిరేకంగా ఆమె నడుచుకోవడం వల్లే ఎల్లో గ్యాంగ్‌కు సునీత ఎంతో ఇష్టమైన మహిళైంది. ఇదే రామోజీకి సంబంధించి మార్గదర్శి ఆర్థిక అక్రమాలపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న ఉండవల్లి అరుణ్‌కుమార్ మాత్రం విలన్ అయ్యారు. అంటే హత్య, ఆర్థిక నేరాలపై పోరాటం చేసేవాళ్లంతా టీడీపీ, ఎల్లో మీడియా దృష్టిలో గొప్ప వాళ్లు కాదన్న మాట.
ఒకే ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా పని చేసే వాళ్లనే నెత్తిన పెట్టుకోవడాన్ని గమనించొచ్చు. వివేకా హత్య కేసు విషయంలో ఎల్లో గ్యాంగ్ వైఖరి విచిత్రంగా వుంది. ఒకే సమయంలో వివేకా కుమార్తె, అలాగే హంతకుడైన దస్తగిరిని వారు ప్రేమించడం గమనార్హం. అంటే వ్యక్తులు, రాజకీయ ప్రయోజనాలను బట్టి న్యాయం, అన్యాయం మారుతూ వుంటాయన్న మాట. నేరానికి పాల్పడింది మనోడైతే… చట్టాన్ని కళ్లు గప్పి అలా చేయడం గొప్ప మేధావితనంగా చిత్రీకరించడం వారికే చెల్లింది. ఇందుకు ఉదాహరణ రామోజీరావే.
రామోజీరావు ఆర్థిక నేరాలపై పోరాడుతున్న ఉండవల్లి అరుణ్‌కుమార్ ఒక మాజీ ఎంపీ. రామోజీ ఆర్థిక స్థితితో పోల్చుకుంటే ఉండవల్లి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా. ఉండవల్లి బలమంతా ఆయన మేధావితనం, అలాగే రామోజీ తప్పులు. రామోజీరావుపై పోరాటంలో ఉండవల్లి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వైఎస్సార్ మరణాంతరం ఉండవల్లికి ఇటు సొంత పార్టీ, ప్రభుత్వం నుంచి కూడా మద్దతు కరువైంది. ఆ విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు.
కానీ వివేకా కుమార్తె సునీతకు టీడీపీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఎల్లో మీడియా మద్దతు పుష్కలంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వానికి, అధికార పార్టీ నాయకులకు వ్యతిరేకంగా సునీత చిన్న స్టెప్ వేసినా, పెద్దగా చూపించడానికి వారంతా సిద్ధంగా ఉన్నారు. అయితే దస్తగిరిని కూడా వెనకేసుకు రావడం ద్వారా వివేకా హత్య కేసు నిందితులందరూ తమ దృష్టిలో సమానం కాదని వారు చెప్పకనే చెప్పారు. ఇదే రాజకీయం అన్నమాట.