ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యర్థులపై ఎదురు దాడి చేయడానికి రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటున్నారు. సహజంగా మనది సెంటిమెంట్ సమాజం. ఒక్కడ్ని చేసి ఎవరైనా దాడి చేస్తే … సమాజం ఆమోదించదు. ప్రజానాడి తెలిసిన రాజకీయ నాయకుడిగా, పాలకుడిగా ప్రజల సెంటిమెంట్‌ను ప్రత్యర్థులపై అస్త్రాలుగా ప్రయోగించనున్నారు.
భవిష్యత్‌లో తన ప్రత్యర్థులను జగన్ ఎలా ఎదుర్కోబోతున్నారో ఇవాళ్టి అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన సభలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఆ సంకేతాలేంటో ఆయన మాటల్లోనే …
“ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతున్నారు. మరో 19 నెలలు ఈ పోరాటం తప్పదు. దేవుడి దయ, ప్రజల దీవెనలు మన ప్రభుత్వానికి ఎప్పుడూ అండగా ఉంటాయి. వారు అబద్ధాలను, మోసాలను, కుట్రలను, పొత్తులను నమ్ముకుంటే.. నేను దేవుడి దయను, అక్కచెల్లెమ్మలను నమ్ముకున్నా. ఇది మంచికి, మోసానికి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో.. రాబోయే రోజుల్లో ఎన్నో కుట్రలు కనిపిస్తాయి. ఈ టీవీలను చూడొద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అని ఆలోచించండి. మంచి జరిగితే నాకు తోడుగా నిలబడండి అని ప్రజలను సీఎం జగన్ పిలుపునిచ్చారు.
ప్రజారంజక పాలన సాగిస్తున్న తాను ఒక వైపు, మిగిలిన దుష్టచతుష్టయం (టీడీపీ, జనసేన, ఎల్లో మీడియా) అంతా మరో వైపు తలపడుతున్నట్టు జగన్ జనం దృష్టికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. జగన్‌ను ఒక్కడిని చేసి, మిగిలిన పక్షాలన్నీ కుట్రలు పన్ని కీడు చేస్తున్నాయనే సంకేతాల్ని జనంలోకి తీసుకెళ్లి తద్వారా తనకు అండగా నిలిచేలా సానుభూతి పొందేందుకు జగన్ వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు.
జగన్ మాట్లాడుతున్నట్టుగానే, ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా కలిసి మూకుమ్మడి దాడి చేస్తున్నారన్న అభిప్రాయం బలపడేలా నిదర్శనాలున్నాయి. ఇదే జగన్‌కు రాజకీయంగా లాభించే అవకాశం వుంది. రానున్న రోజుల్లో ప్రజలకు ప్రయోజనం కలిగించే పాలన సాగిస్తున్న తనను ఒంటరి వాడిని చేశారని, మీరే కాపాడుకోవాలని మరింత బలంగా జగన్ మాట్లాడనున్నారు. అందుకే తాను మీడియాను, కుట్రల్ని, పొత్తుల్ని నమ్ముకోలేదని పదేపదే చెప్పడం. అంతటితో ఆయన ఊరుకోలేదు.
కేవలం అక్కచెల్లెళ్లను, దేవుడిని నమ్ముకున్నానని సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ అప్పీల్ ప్రజానీకాన్ని, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల్లో సానుభూతి పెంచుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.