ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడానికి ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలిసింది. ఈ మేరకు అపాయింట్మెంట్ అడిగారని సీఎంవో వర్గాలు తెలిపాయి. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది. ఇటీవలే ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వచ్చారు.
ఏపీలో టీడీపీ – జనసేన కూటమితో బీజేపీ పొత్తుపై విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ వెళ్తారనే సమాచారం ప్రత్యర్థుల్లో గుబులు రేపుతోంది. గత నెలలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాను చంద్రబాబు కలిసిన వెంటనే, సీఎం జగన్‌ను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు. దీంతో ఢిల్లీలో అసలేం జరుగుతున్నదో అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్‌ను బీజేపీ పెద్దలు పట్టించుకోవడం లేదు.
పవన్‌కల్యాణ్‌కు నేడో, రేపో ఢిల్లీ నుంచి ఆహ్వానం వస్తుందని, వెళ్తారని జనసేన, టీడీపీ నేతలు ప్రచారం చేసుకోవడమే తప్ప, ఆచరణకు నోచుకోవడం లేదు. మరోవైపు జగన్ మాత్రం వెంటవెంటనే ఢిల్లీకి వెళ్లడం, కేంద్ర పెద్దలతో చర్చించి వస్తుండడంతో కొందరికి దిక్కుతోచడం లేదు.
పొత్తుపై బీజేపీ ఎటూ తేల్చకపోవడం, ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలతో సమానంగా సంబంధాలు కొనసాగిస్తుండడం దేనికి సంకేతమనే చర్చకు తెరలేచింది. ఢిల్లీ నుంచి అపాయింట్మెంట్పై సానుకూల సమాచారం వచ్చిన వెంటనే , జగన్ ఢిల్లీ వెళ్లి చర్చించి రానున్నారు.