ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పదవుల జపం చేస్తున్నారు. అణగారిన వర్గాలకు ప్రాధాన్యం విషయంలో జగన్ తర్వాతే ఎవరైనా. ఏపీ రాజకీయాల్లో సోషల్ ఇంజనీరింగ్ అత్యంత కీలక రోల్ పోషిస్తోంది.
అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకోవడం వల్లే 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి వర్గంలోనూ, ఇతరత్రా జగన్ ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడానికి అధికార పార్టీ వైసీపీ ఇవాళ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టింది.
శ్రీకాకుళం నుంచి బస్సుయాత్ర ప్రారంభించిన సందర్భంగా రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పాలనలో భాగస్వామ్యం కోసం పోరాటాలు చేస్తున్నాయన్నారు.
మొదటిసారిగా తమ ప్రభుత్వంలో 74 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మంత్రులయ్యారన్నారు. ఇది చరిత్రలో సీఎం వైఎస్ జగన్ ఒక్కరే చేయగలిగారని పొగడ్తలతో ముంచెత్తారు. ఇలా చేయాలని సీఎం జగన్‌ను ఎవరూ అడగలేదన్నారు. ఆయనే స్వతహాగా అవకాశం కల్పించారన్నారు.
పదవులతో పాటు ప్రభుత్వ పథకాల్లో 82 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారన్నారు. దీన్ని కూడా కొందరు హేళన చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేసే వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అవమానించినట్టే అని తేల్చి చెప్పారు. ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎవరికీ తల వంచకుండానే పథకాలన్నీ వాళ్ల చెంతకే వెళుతున్నాయన్నారు.
చంద్రబాబు రాష్ట్ర మంతా తిరిగారన్నారు. కానీ, తాము ఇచ్చిన పథకాల్లో తప్పు జరిగిందని చెప్పగలిగాడా? అని ప్రశ్నించారు. పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న సంఘసంస్కర్త సీఎం జగన్ అని అభివర్ణించడం గమనార్హం. ప్రజలకి వాస్తవాలు వివరించేందుకు బస్సు యాత్ర చేస్తున్నట్టు మంత్రి సీదిరి తెలిపారు.