ఎన్నికల్లో ఘోర పరాజయం బాట పట్టిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. రాజీనామా లేఖను సమర్పించడానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్‌మెంట్‌ను ఆయన అడిగారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ సమయానికి సీఎం వైఎస్ జగన్ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఐదేళ్ల పాటు సీఎం పదవిలో ఉన్న జగన్… ఈ ఎన్నికల్లో ప్రజాదరణ పొందలేకపోయారు.
టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఏపీ ప్రజానీకం పట్టం కట్టింది. ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో కూటమి 160కి తక్కువ కాకుండా తుది ఫలితాలు వచ్చే సరికి విజయం సాధించే అవకాశం వుంది. దీంతో వైఎస్ జగన్ ప్రజాతీర్పునకు తలొగ్గి రాజీనామా చేయాల్సిన తప్పని సరి పరిస్థితి ఏర్పడింది.
బహుశా ఈ స్థాయిలో ఘోర పరాజయాన్ని జగన్‌తో పాటు వైసీపీ నేతలెవరూ ఊహించి వుండరు. సంక్షేమ పథకాల లబ్ధి కలిగించానని, అలాగే సీట్ల పంపకాల్లో సామాజిక సమీకరణలకు పెద్దపీట వేశానని, అధికారాన్ని తప్పక నిలబెట్టుకుంటానని జగన్ అంచనా కట్టారు. కానీ జగన్ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. చివరికి ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది.
ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వైఎస్ జగన్, ప్రజా వ్యతిరేక తీర్పుతో ఇంటి బాట పట్టాల్సి వచ్చింది.