టీడీపీ, జనసేన పిచ్చి చేష్టలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాజకీయంగా ఎంతో ప్రయోజనం కలిగిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్‌పై దాడి అనంతరం, టీడీపీ -జనసేన నేతలు చేసిన అవహేళన కామెంట్స్ చాలా మందిలో వారిపై అసహనం, ఆగ్రహం కలిగించాయి. రాజకీయంగా ఏదైనా వుంటే చూసుకోవాలే తప్ప, మరీ ఇంత దుర్మార్గమా? అనే చర్చకు తెరలేచింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అసంతృఫ్తిగా ఉన్న వైసీపీ నేతల్ని సైతం టీడీపీ, జనసేన చర్యలు ఆలోచింపజేస్తున్నాయి. ఈ సమయంలో జగన్‌కు అండగా నిలబడకపోతే, మనోడిని ఏదైనా చేసేలా ఉన్నారనే భయం వైసీపీ అసంతృప్త నేతల్లో కలిగించింది. దీంతో జగన్‌తో సమస్య వుంటే, ఎన్నికల తర్వాత చూసుకోవచ్చని, మరోసారి ఈ ఎన్నికల్లో అండగా నిలబడాలనే నిర్ణయానికి చాలా మంది వచ్చారు.
రాజకీయంగా జగన్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకపోవడం, ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి, మరోసారి అధికారంలోకి రావడం ఖాయమనే భయం ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలను వెంటాడుతోందని అంటున్నారు. అందుకే జగన్‌ను భౌతికంగా అంతమొందిస్తే, ఇక తమకు అడ్డు తొలగుతుందని కుట్రలో భాగంగా ఎంతకైనా బరి తెగించడానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ రెడీ అయ్యారని జగన్ అభిమానులు భావిస్తున్నారు.
విజయవాడలో జగన్‌పై దాడి ఘటన, వైసీపీకి ఎన్నికల్లో బలంగా చేసేలా కొన్ని వర్గాల ప్రజల్ని ఏకతాటిపైకి తెచ్చిందన్నది వాస్తవం. ఈ ఒక్క దఫా జగన్‌ను సీఎం చేసుకుంటే, చాలా దరిద్రాలు తుడిచి పెట్టుకుపోతాయనే అభిప్రాయానికి వారంతా వచ్చారు. అందుకే జగన్ కోసం పని చేసేందుకు ఇంత కాలం అసంతృప్తిగా ఉన్న నాయకులు కూడా మనసు మార్చుకుంటున్నారు. మరి కొందరు ఇప్పటికే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు.
మరోసారి జగన్‌ను అధికారంలోకి తెచ్చుకోకపోతే, తాజా ఘటనను ఉదహరిస్తూ, ఎలా నష్టపోతామో వివరిస్తున్నారు. ఏది ఏమైనా జగన్‌పై దాడి ఘటన టీడీపీ, జనసేన పాలిట శరాఘాతమని చెప్పక తప్పదు.