ఒకే జిల్లా నుంచి ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యులు

వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు విజ‌య‌సాయిరెడ్డికి మ‌రోసారి రాజ్య‌స‌భ ప‌ద‌వి ద‌క్కింది. మ‌రో ఆరేళ్ల పాటు ఎలాంటి ఢోకాలేకుండా అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌లో కాలం గ‌డ‌పొచ్చు.  Advertisement ప‌నిలో ప‌నిగా త‌న…

వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు విజ‌య‌సాయిరెడ్డికి మ‌రోసారి రాజ్య‌స‌భ ప‌ద‌వి ద‌క్కింది. మ‌రో ఆరేళ్ల పాటు ఎలాంటి ఢోకాలేకుండా అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌లో కాలం గ‌డ‌పొచ్చు. 

ప‌నిలో ప‌నిగా త‌న శిష్యుడు బీద మ‌స్తాన్‌రావుకి కూడా రాజ్య‌సభ సీటు ఇప్పించుకోగ‌లిగారు. చెన్నైలో విజ‌య‌సాయిరెడ్డి ఆడిట‌ర్‌గా కొన‌సాగుతున్న స‌మ‌యంలో బీద మ‌స్తాన్ రావు ఆయ‌న వద్ద శిష్య‌రికం చేశార‌ని నెల్లూరులో టాక్‌.

తాజాగా రాజ్య‌స‌భ ప‌ద‌వులు పొందిన నలుగురిలో ఒకే జిల్లాకు చెందిన ఇద్ద‌రు ఉండ‌డం విశేషం. విజ‌య‌సాయిరెడ్డి, బీద మ‌స్తాన్ రావు నెల్లూరు జిల్లా వాస్త‌వ్యులు. ఇదే జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి కూడా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో రాజ్య‌స‌భ‌లోఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వారిలో అత్య‌ధికులు నెల్లూరు వాసులే కావ‌డం విశేషం. ముగ్గురు స‌భ్యులు నెల్లూరు జిల్లా నుంచే ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

ఇంతే కాదు, నెల్లూరుకు మ‌రో ఘ‌న‌త కూడా ఉంది. నెల్లూరు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి కూడా నెల్లూరు జిల్లా వాసే కావ‌డం విశేష‌మే. మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డిది నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరు స్వ‌గ్రామం. 

బ‌హుశా ఒకే జిల్లా నుంచి ఐదుగురు అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌ల్లో ఉండ‌డం నెల్లూరు గొప్ప‌త‌నంగా చెప్పుకోవ‌చ్చు. దీన్ని బ‌ట్టి రాజ‌కీయంగా నెల్లూరు జిల్లా ఎంత చైత‌న్య‌వంత‌మైందో అర్థం చేసుకోవ‌చ్చు.