ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తూ, వైసీపీ హయాంలో అంతా దోపిడీ అని చెబుతున్నారు. ఇప్పటికి నాలుగు శ్వేత పత్రాల్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సహజవనరుల దోపిడీ పేరుతో చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో ఆయన సంచలన విషయాలు ప్రస్తావించారు.
వైసీపీ హయాంలో 1.75 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, వీటి విలువ రూ.35 వేల కోట్లు అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఇసుక, మైనింగ్‌లో కూడా విపరీతంగా దోపిడీ జరిగిందని, వీటి విలువ రూ.20 వేల కోట్లు అని ఆయన ఆరోపించడం గమనార్హం. చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయగా, వాటికి దీటైన సమాధానం ఇచ్చేందుకు వైసీపీకి నాయకులు కరువయ్యారనే అనుమానం కలుగుతోంది.
చంద్రబాబు శ్వేతపత్రానికి దీటైన కౌంటర్ ఇచ్చేందుకు సాక్షి మీడియానే దిక్కైంది. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియా ముందుకొచ్చి చంద్రబాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వాల్సింది జగన్ కేబినెట్‌లో పని చేసిన రెవెన్యూ, మైనింగ్ శాఖల మంత్రులు కదా? మరి వారు ఏమయ్యారు? చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్ధాలని సాక్షి పత్రికలో బ్యానర్ కథనం రాస్తే సరిపోతుందా? బాబుకు కౌంటర్ ఇవ్వడం సాక్షి మీడియా బాధ్యతా?
చంద్రబాబు మాదిరిగా వైసీపీ మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద్‌రావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకు ఇవ్వకూడదు? అధికారం దర్పం ప్రదర్శించడానికి ముందుకుండే వైసీపీ నాయకులు, ఆ పార్టీకి అవసరమైనప్పుడు తెర ముందుకు రాకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. వైసీపీ నిర్లక్ష్య, ఉదాసీనత వైఖరి వల్ల చంద్రబాబు చెప్పిందే నిజమని నమ్మే పరిస్థితులున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి, చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చ అబద్ధాలు ఏ విధంగా అవుతాయో వివరాలు వెల్లడించాలి. వాటిని సాక్షి పత్రిక పతాక శీర్షికతో ప్రచురిస్తే జనం నమ్ముతారు. వైసీపీ చేయాల్సింది కూడా ఇదే. ఇప్పటికైనా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆలోచించాలి. చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తుంటే, సంబంధం లేని నాయకులు వచ్చి వివరణలు ఇవ్వడంపై ప్రజలు హర్షించరు.