Advertisement

Advertisement


Home > Politics - Andhra

తమ్మినేనిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రెబెల్ అభ్యర్ధి

తమ్మినేనిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రెబెల్ అభ్యర్ధి

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం స్పీకర్ తమ్మినేని సీతారాంకి ఒకనాడు కంచుకోట. ఆయన తెలుగుదేశం తరఫున 1983లో మొదటిసారి పోటీ చేసి గెలిచారు. ఆ విధంగా ఆయన టీడీపీ నుంచి నాలుగు సార్లు గెలిచారు. 1999 తరువాత ఆయన మళ్లీ గెలిచింది 2019లోనే. అది వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు.  

ఆయన ఆ విధంగా ఐదవసారి విజేత అయ్యారు. మంత్రి పదవిని ఆయన ఆశించారు కానీ స్పీకర్ పదవితో జగన్ గౌరవించారు. ఈసారి టికెట్ దక్కుతుందో లేదో అన్న చర్చ నడచినా తమ్మినేనికే జగన్ టికెట్ ఇచ్చారు. దాంతో ఆయన తన రాజకీయ జీవితంలో పదో సారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ పడుతున్నారు.

ఈసారి తనకు ఆఖరి ఎన్నికలు అని ఆయన అంటున్నారు. ఈసారి గెలిస్తే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి సంతృప్తిగా రాజకీయ విరమణ చేయాలని తన వారసుడిని తయారు చేసుకోవాలని తమ్మినేని ఆకాంక్షిస్తున్నారు. అయితే ఆముదాలవలసలో తమ్మినేనికి సొంత మేనల్లుడే అయిన కూన రవికుమార్ టీడీపీ నుంచి ప్రధాన ప్రత్యర్థి గా ఉన్నారు. ఈ ఇద్దరు మధ్యన ఇది నాలుగవ సారి  పోటీగా సాగుతోంది.

ఆముదాలవలసలో టీడీపీకి మంచి బలం ఉంది. వైసీపీ పటిష్టంగా ఉండేది కానీ అందులో నుంచి తమ్మినేని అభ్యర్ధిత్వం పట్ల అసంతృప్తితో వర్గాలుగా విడిపోయారు. కొందరు సైలెంట్ గా ఉంటే సువ్వారి గాంధీ అనే నేత పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీకి దిగిపోయారు.

ఆయన వల్ల వైసీపీకి ఓట్ల నష్టం భారీగా జరుగుతుందని కలవరపడుతున్నారు. తమ్మినేని తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి వర్గాలను దారికి తెచ్చుకోలేకపోయారు అని అంటున్నారు. వైసీపీని ఆకట్టుకుని గ్రామ స్థాయి నాయకులను టీడీపీ సైకిలెక్కించేస్తోంది. ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నసువ్వారి గాంధీని పోటీ నుంచి విరమించుకునేలా చేస్తే తమ్మినేని విజయావకాశాలు పదిలంగా ఉంటాయని అంటున్నారు.

అలా కాకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అయితే ఈసారి ఎన్నికల ప్రత్యేకంగా సాగుతుందని సంక్షేమ పధకాల లబ్దిదారులు అంతా వైసీపీకి ఓట్లు వేస్తారని అలా తమ ఓటు బ్యాంక్ 2019 కంటే పెరిగిందని తమ్మినేని వర్గీయులు చెబుతున్నారు. ఆముదాలవలస మాత్రం టీడీపీ వైసీపీల మధ్య గట్టి పోటీగా ఉండే సీటు గానే ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?