Advertisement

Advertisement


Home > Politics - Andhra

మాధ‌వ్‌పై చ‌ర్య‌...ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ్‌!

మాధ‌వ్‌పై చ‌ర్య‌...ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ్‌!

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై నేడో, రేపో చ‌ర్య‌లు తీసుకుంటార‌నే ఊహాగానాల‌కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెర‌దించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. ముఖ్యంగా మూడు నాలుగు రోజులుగా తీవ్ర రాజ‌కీయ దుమారం రేపుతున్న మాధ‌వ్ న్యూడ్ వీడియోపై ఆయ‌న స్ప‌ష్ట‌త ఇచ్చారు. మాధ‌వ్‌పై చ‌ర్య‌ల‌కు సంబంధించి నివేదిక రావాల‌నే ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌ని స‌జ్జ‌ల తేల్చి చెప్పారు.  

మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న న్యూడ్ వీడియో త‌న‌ది కాద‌ని, మార్ఫింగ్ చేశార‌ని, నిజాల్ని నిగ్గు తేల్చాల‌ని హిందూపురం ఎంపీ స్వ‌యంగా ఫిర్యాదు చేశార‌ని స‌జ్జ‌ల గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా 2015లో తెలంగాణ‌లో ఓటుకు నోటు కేసును స‌జ్జ‌ల తెర‌పైకి తెచ్చారు. త‌న దృష్టిలో మాధ‌వ్ ఎపిసోడ్ కంటే, చంద్ర‌బాబు ఓటుకు నోటు కేసులో చిక్క‌డ‌మే పెద్ద నేర‌మ‌న్నారు. ఓటుకు నోటు కేసులో అప్ప‌టి టీడీపీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ప్ర‌లోభ పెడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డార‌న్నారు.

అలాగే చంద్ర‌బాబు మ‌న వాళ్లు బ్రీప్‌డ్ మి అన్నార‌ని గుర్తు చేశారు. ఈ ఘ‌ట‌న జ‌రిగి ఏడేళ్లు అవుతున్నా ఇంత వ‌ర‌కూ ఆ వాయిస్ చంద్రబాబుదా? కాదా? అని తేల్చ‌లేద‌న్నారు. ఆ వాయిస్ త‌న‌దా?  కాదా? అనేది చంద్ర‌బాబే చెప్పొచ్చ‌న్నారు. ఆ వాయిస్ చంద్ర‌బాబుదే అని అంద‌రికీ తెలుస‌న్నారు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌నే భ్ర‌ష్టు ప‌ట్టించేలా, అలాగే రాజ్యాంగాన్ని అవ‌హేళ‌న చేసేలా ఓటు కొనుగోలును ప్రోత్స‌హించార‌న్నారు.

కానీ మాధ‌వ్ వ్య‌వ‌హారం భిన్న‌మైంద‌న్నారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య జ‌రిగిన వ్య‌వ‌హారంగా చెబుతున్నార‌ని, మీడియాలో చెలామ‌ణి అవుతున్న వీడియోలో మ‌రెవ‌రో చిత్రీక‌రిస్తున్న‌ట్టు ఉంద‌న్నారు. కానీ చంద్ర‌బాబు వాయిస్ మాత్రం ఒరిజిన‌ల్ అని చెప్పుకొచ్చారు. బాబు త‌ప్పిదానికి స‌పోర్టింగ్‌గా రేవంత్‌రెడ్డి డ‌బ్బులిస్తూ ప‌ట్టుబ‌డ్డాడ‌న్నారు. పార్టీ అధ్య‌క్షుడిగా, అప్పుడు ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు తీవ్ర నేరానికి పాల్ప‌డ్డార‌ని స‌జ్జ‌ల విమ‌ర్శించారు.

న్యూడ్ వీడియో మార్ఫింగ్ కాద‌ని తేలితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌నే మాట‌కు పార్టీ, సీఎం జ‌గ‌న్ క‌ట్టుబ‌డి ఉంటార‌న్నారు. నిజానిజాలు నిగ్గు తేలే వ‌ర‌కూ వేచి చూడాల‌ని కోరారు. ఈ లోపు కొంప‌లు అంటుకుపోవ‌న్నారు. ఇత‌ర స‌మ‌స్య‌లు చాలా వున్నాయ‌ని తేల్చి చెప్పారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?