Advertisement

Advertisement


Home > Politics - Andhra

బాబును ముంచ‌నున్న ఆ ఇద్ద‌రు!

బాబును ముంచ‌నున్న ఆ ఇద్ద‌రు!

చంద్ర‌బాబును ఓడించేది ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనుకుంటే పొర‌పాటు. బాబును నిలువునా ముంచేది మిత్ర‌ప‌క్ష పార్టీల ముఖ్య నేత‌లే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బాబును ప్ర‌ధాని మోదీ, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌ట్టేట ముంచుతార‌నే భ‌యం టీడీపీ శ్రేణుల్లో నెల‌కుంది. అస‌లు క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతున్న‌దో చంద్ర‌బాబుకు అర్థ‌మ‌వుతున్న‌ట్టు లేదు. ఆయ‌న‌కు వాస్త‌వాలు చెప్పే వారు కూడా లేరనే వాద‌నలో నిజం వుంది.

బీజేపీ, జ‌న‌సేన‌తో బాబు పొత్తు పెట్టుకోడానికి బ‌ల‌మైన కార‌ణాలున్నాయి. ఏ ల‌క్ష్యంతో పొత్తు పెట్టుకున్నారో, దానికి విరుద్ధంగా ఇప్పుడు జ‌రుగుతోంది. బీజేపీతో పొత్తు వ‌ల్ల వ్య‌వ‌స్థ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని చంద్ర‌బాబు ఆశించారు. అలాగే జ‌న‌సేన‌తో పొత్తు వ‌ల్ల ముఖ్యంగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలతో పాటు ఇత‌ర ప్రాంతాల్లోని కాపులంతా టీడీపీకి ఓట్లు వేస్తార‌నేది బాబు అంచ‌నా.

రాజ‌కీయాల్లో ఎప్పుడూ 1+1=2 కాద‌ని అంటారు. ప‌వ‌న్, బీజేపీ విష‌యంలో బాబు అంచ‌నా త‌ప్పింద‌ని క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు చెబుతున్నాయి. పైగా బీజేపీ, ప‌వ‌న్ వ‌ల్ల కొన్ని సామాజిక వ‌ర్గాల ఓట్ల‌ను పోగొట్టుకోవ‌డంతో పాటు, బంగారు ప‌ల్లెంలో జ‌గ‌న్‌కు అప్ప‌గిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది.

ఇటీవ‌ల కాలంలో ముస్లింల‌పై మోదీ విద్వేష‌పూరిత కామెంట్స్ చేస్తున్నార‌ని దేశ‌మంతా గ‌గ్గోలు పెడుతోంది. దీంతో టీడీపీకి అనుకూల‌మైన ముస్లిం ఓట‌ర్లు కూడా ఇప్పుడు కూట‌మికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌ద్ద‌తు ఇచ్చే ప్ర‌సక్తే వుండ‌దు. అలాగే క్రిస్టియన్ ఓట్ల‌ను కూడా టీడీపీ చేజార్చుకుంది.

ఇక ప‌వ‌న్ విష‌యానికి వెళ్దాం. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో త‌న సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న చోట ప‌వ‌న్ ప‌దేప‌దే కాపుల రిజ‌ర్వేష‌న్ గురించి ప్ర‌స్తావిస్తున్నారు. కాపుల రిజ‌ర్వేష‌న్‌కు జ‌గ‌న్ గండికొట్టార‌ని ప‌వ‌న్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ప‌వ‌న్ అజ్ఞానం టీడీపీని నిలువునా ముంచ‌నుంది. ఏ ర‌కంగా అయితే బీజేపీ తీరుతో ముస్లిం, క్రిస్టియ‌న్ మైనార్టీల ఓట్ల‌ను టీడీపీ పోగొట్టుకుందో, ప‌వ‌న్ కుల పిచ్చి కామెంట్స్ కూడా చంద్ర‌బాబుకు భారీ న‌ష్టం క‌లిగించ‌నుంది.

కాపు వ్య‌తిరేకిగా జ‌గ‌న్‌ను చిత్రీక‌రించ‌డం వ‌ల్ల ఇటు కాపులు, అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట‌ర్ల‌ను టీడీపీ న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితి. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జాభిప్రాయం ఇదే తెలియ‌జేస్తోంది. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంలో ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ త‌న చేత‌ల్లో లేద‌ని జ‌గ‌న్ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. ఇక కాపుల‌ను జ‌గ‌న్ మోస‌గించార‌నే ఆరోప‌ణ‌లో ప‌స లేదు.

చంద్ర‌బాబే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాన‌ని చెప్పి వంచించార‌ని గ‌తంలో ఆ సామాజిక వ‌ర్గం రోడ్డెక్కిన సంగ‌తి తెలిసిందే. అప్పుటు చంద్ర‌బాబు నీడ‌లోనే ప‌వ‌న్ సేద‌దీరారు. కాపుల ఓట్ల‌ను కొల్ల‌గొట్టాల‌నుకునే క్ర‌మంలో మిగిలిన సామాజిక వ‌ర్గాల‌ను కూట‌మికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ విజ‌య‌వంతంగా దూరం చేస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అలాగ‌ని కాపులంతా ప‌వ‌న్ వెంట న‌డిచే ప‌రిస్థితి ఏ మాత్రం లేదు. రానున్న ఎన్నిక‌ల్లో మోదీ, ప‌వ‌న్ వ‌ల్ల తన‌కు క‌లిగిన న‌ష్టం గురించి బాబుకు తెలిసొస్తుంది.

జ‌గ‌న్‌పై విద్వేషంతో ప‌వ‌న్ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డ‌మే కూట‌మి పాలిట శాప‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో బాబును మోదీ, ప‌వ‌న్ నిలువునా ముంచ‌నున్నార‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జరుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?