Advertisement

Advertisement


Home > Politics - Andhra

చంద్ర‌గిరి బ‌రి నుంచి చెవిరెడ్డి త‌ప్పుకుంటున్నారా?

చంద్ర‌గిరి బ‌రి నుంచి చెవిరెడ్డి త‌ప్పుకుంటున్నారా?

చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి చంద్ర‌గిరి బ‌రి నుంచి త‌ప్పుకుంటున్నారా? అంటే...ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉన్న నేప‌థ్యంలో పార్టీ బాధ్య‌త‌ల్ని ఆయ‌న నెత్తికెత్తుకున్నారు. ఇదే సంద‌ర్భంలో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న దూర‌మ‌వుతూ, పెద్ద కుమారుడు మోహిత్‌రెడ్డిని చేరువ చేస్తున్నార‌నే చ‌ర్చ ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో విస్తృతంగా సాగుతోంది.

ఈ చ‌ర్చ‌కు తాజాగా చెవిరెడ్డికి సీఎం జ‌గ‌న్ అప్ప‌గించిన కొత్త బాధ్య‌త బ‌లం క‌లిగిస్తోంది. తిరుప‌తి జిల్లా వైసీపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి చెవిరెడ్డిని త‌ప్పించి, ప్ర‌మోష‌న్ ఇవ్వ‌డం కీల‌క ప‌రిణామం. వైసీపీ అనుబంధ విభాగాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా చెవిరెడ్డికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కొత్త బాధ్య‌త‌లు అప్ప‌గించారు. చెవిరెడ్డి స్వ‌భావం చూసి ర‌మ్మంటే కాల్చి వ‌చ్చే ర‌కం. ఆయ‌న ప‌ట్టుప‌డితే అంతు చూసే వ‌ర‌కూ విడిచిపెట్ట‌రు.

జెడ్పీటీసీ స‌భ్యుడిగా మొద‌లైన ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం... వేల కోట్ల‌కు అధిప‌తి అయిన గ‌ల్లా అరుణ‌కుమారిని ఓడించే స్థాయికి ఎదిగారు. చంద్ర‌గిరి నుంచి వ‌రుస‌గా రెండుసార్లు గెలుపొందారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత తుడా చైర్మ‌న్‌గా నియ‌మితుల‌య్యారు. అలాగే టీటీడీ ఎక్స్ అఫిషియో స‌భ్యుడిగా, ప్ర‌భుత్వ విప్‌గా ఆయ‌న నియ‌మితుల‌య్యారు. తాజాగా వైసీపీ అనుబంధ విభాగాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా సీఎం జ‌గ‌న్ నియ‌మించారంటే, ఆయ‌న ఎంత న‌మ్మ‌కాన్ని చూర‌గొన్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

వైసీపీలో ఒక ప‌ద‌వికే దిక్కులేని నాయ‌కులెంతో మంది ఉన్నారు. కానీ వైఎస్ జ‌గ‌న్ ఆశీస్సులు పొంద‌డంలో ఆయ‌న విజ‌యం సాధించారు. దీంతో ఇక వెనుతిరిగి చూడ‌లేదు. అన్ని ర‌కాలుగా ఆయ‌న అంచెలంచెలుగా ఎదుగుతూ వెళుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని ఆయ‌న త‌పిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో చంద్ర‌గిరి వెలుప‌ల కూడా త‌న పేరు వినిపించేలా చేసుకునే క్ర‌మంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మ‌రోవైపు చంద్ర‌గిరిలో త‌న కుమారుడిని యాక్టీవ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి పాద‌యాత్ర చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు కృషి చేస్తున్నారు. చెవిరెడ్డి మాత్రం త‌న ఆశ‌యాల్ని నెర‌వేర్చుకునేందుకు నియోజ‌క‌వ‌ర్గం వెలుప‌లే ఎక్కువ‌గా గడుపుతున్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న కాస్త దూరంగానే వుంటున్నారు. అంతెందుకు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో చెవిరెడ్డి స‌రిగా పాల్గొన‌లేద‌ని స్వ‌యంగా జ‌గ‌నే అన్న‌ట్టు వార్త‌లొచ్చాయి.

వైసీపీని అధికారంలోకి తీసుకురావ‌డంలో అనుబంధ సంఘాలు కీల‌కం. వాటి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా చెవిరెడ్డిని నియ‌మించ‌డం అంటే... రానున్న రోజుల్లో రాష్ట్ర‌స్థాయిలో ఆయ‌న కీల‌కం కానున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో చంద్ర‌గిరిలో చెవిరెడ్డి పెద్ద కుమారుడు బ‌రిలో నిలుస్తార‌ని, భాస్క‌ర్‌రెడ్డి రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం ప‌ని చేస్తార‌నే ప్ర‌చారం మాత్రం ఊపందుకుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?