Advertisement

Advertisement


Home > Politics - Andhra

వైసీపీ నెత్తిన పాలు పోస్తున్న సీఎం?

వైసీపీ నెత్తిన పాలు పోస్తున్న సీఎం?

ఆయన ఎన్నో జిల్లాలు దాటుకుని అనకాపల్లి నుంచి పోటీకి సిద్ధపడ్డారు. ఎంచుకున్న పార్టీ బీజేపీ. పైగా మొదటి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అనకాపల్లిని అభివృద్ధి చేస్తాను అందుకే పోటీ అంటున్నారు సీఎం రమేష్. ఆయన బీజేపీ తరఫున పోటీలో ఉన్నా తెలుగుదేశం నాయకులతోనే చెట్టాపట్టాల్ వేసుకుంటున్నారు అని స్థానిక బీజేపీ నేతలు మండిపోతున్నారు.

ఆయన వ్యవహార శైలి స్థానిక కమలనాధులకు మింగుడు పడడం లేదు. ఎన్నికల వేళ ఏ పార్టీ అభ్యర్ధి అయినా అందరి సాయం తీసుకోవాల్సి ఉంటుంది ఒకటికి రెండు సార్లు తగ్గి ఉండాల్సి ఉంటుంది. కానీ సీఎం రమేష్ మాత్రం తన వ్యవహార శైలితో సొంత పార్టీ నేతలను దూరం చేసుకుంటున్నారు అని అంటున్నారు.

తమ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్ధి కదా అని స్థానిక బీజేపీ నేతలు ఆయన కోసం పని చేయాలని చూసినా ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారంతా కలత చెందారు. దాంతో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు వైసీపీలోకి చేరిపోతున్నారు. సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి కావడం పుణ్యమాని బీజేపీకి ఎప్పటి నుంచో పనిచేస్తూ వస్తున్న రాష్ట్ర కార్యదర్శి కొలపర్తి శ్రీను బీజేపీని వీడి వైసీపీలో చేరిపోయారు.

నియోజకవర్గానికి కొత్త అయిన రమేష్ పార్టీ నేతలను దగ్గరకు తీయకుండా అంతా తాను చెప్పినట్లుగా జరగాలని భావించడంతో ఈ విధంగా జరుగుతోంది అని అంటున్నారు.ఆయనతో పాటు పార్టీలో కీలకంగా ఉంటూ చాలా ఏళ్ళుగా పనిచేస్తున్న బీజేపీ నేతలు కమలానికి గుడ్ బై కొట్టేసి వైసీపీలో చేరిపోయారు.

ఇదిలా ఉంటే బీజేపీ పెద్దల ఎంపికే తప్పు అని కమలం పార్టీ నేతలు అంటున్నారు. అసలు ఉత్తరాంధ్రాలో బీజేపీ పెద్దగా లేదని, కాస్తో కూస్తో విశాఖలో బలం ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సెగ రగిల్చి అక్కడా వ్యతిరేకతను తెచ్చుకున్నారని ఇపుడు తగుదునమ్మా అని అనకాపల్లి సీటు తీసుకుని గెలుపు స్వారీ చేయడమేంటని అంటున్నారు. అలాగే స్థానిక బీసీ నేత ఎవరూ పోటీకి బీజేపీకి కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు.

దీంతో ఇపుడు టీడీపీ కూటమిలో బీజేపీ అసంతృప్తి అన్నది ఇబ్బందికరంగా మారుతోంది అనీ  అంటున్నారు. బీజేపీతో పాటు టీడీపీ నేతలు కూడా వైసీపీలో చేరుతున్నారు. పొత్తుల పేరుతో టీడీపీ చేసిన ప్రయోగాలకు స్థానిక నేతలు విసిగి ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఎక్కడ నుంచో వచ్చిన సీఎం రమేష్ స్థానిక పరిస్థితులను రాజకీయాలను కార్యకర్తలు నేతల మనోభావాలను అర్ధం చేసుకోకుండా వ్యవహరించడం ఉన్న వారిని దూరం చేసుకోవడంతో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏమి జరుగుతుందో అన్న బెంగ కూటమిలో పట్టుకుంది అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?