Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబోయ్‌... ఆమెను భ‌రించ‌లేం!

బాబోయ్‌... ఆమెను భ‌రించ‌లేం!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో విధులు నిర్వ‌హించడం అదృష్టంగా భావిస్తుంటారు. అయితే భ‌క్తుల‌కు సేవ‌లు చేయాల్సింది పోయి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని  ఓ మ‌హిళా అధికారి వేధిస్తున్న వైనం వెలుగు చూసింది. టీటీడీలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఓ మ‌హిళా అధికారి నాలుగేళ్లుగా ప‌ని చేస్తున్నారు.  

పోలీస్‌శాఖ‌లో ఇన్‌స్పెక్ట‌ర్ స్థాయి మ‌హిళా అధికారి డిప్యుటేష‌న్‌పై టీటీడీలో చేరారు. టీటీడీలో ఎవ‌రైనా నిజాయ‌తీగా, నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేస్తే... ఈ మ‌హిళా అధికారికి అస‌లు న‌చ్చ‌దు. ఏదో ర‌కంగా అలాంటి వారిని ముప్పుతిప్ప‌లు పెట్ట‌డానికి, ఆకాశ రామ‌న్న ఉత్త‌రాల పేరుతో తెర‌లేపుతారు. విజిలెన్స్ విభాగంలో ఉన్న‌తాధికారుల‌కు కూడా లేనంత మంది అసిస్టెంట్లు ఈమెకు ఉన్నారు. ముగ్గురు టీటీడీ ఉద్యోగుల్ని అసిస్టెంట్లగా పెట్టుకున్న‌ట్టు స‌మాచారం.

ఏ రోజూ విధుల‌కు స‌మ‌యానికి రాని ఉద్యోగిగా పేరు పొందారు. సొంత కారును బాడుగ పేరుతో టీటీడీ నుంచి సొమ్ము రాబ‌డుతున్నారంటే... ఈమె ఏ స్థాయి అవినీతి అధికారో అర్థం చేసుకోవ‌చ్చు. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ప్ర‌ధాన విధులు అవినీతిని అరిక‌ట్ట‌డం. టీటీడీలో చ‌ట్ట‌విరుద్ధ‌మైన కార్య‌క‌లాపాల‌ను అడ్డుకోవ‌డం.

అయితే స‌ద‌రు మ‌హిళా అధికారి చ‌ర్య‌లు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. క‌నురెప్పే కాటు వేసిన చందంగా... త‌న ముగ్గురు అసిస్టెంట్ల‌ను అడ్డం పెట్టుకుని ఇష్టానురీతిలో అవినీతికి పాల్ప‌డుతున్న‌ట్టు ఆమె గురించి టీటీడీలో క‌థ‌లుక‌థ‌లుగా చెబుతున్నారు. ఆకాశ రామ‌న్న పేరుతో తానే ఫిర్యాదులు చేయించ‌డం, వాటిపై విచార‌ణాధికారిగా ఆమే వెళ్లి... త‌న‌కు కావాల్సిన విధంగా దారికి తెచ్చుకోడానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. డిమాండ్ చేసినంత‌గా డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే... నెగెటివ్ నివేదిక‌లు స‌మ‌ర్పిస్తూ ఉద్యోగుల క‌డుపు కొట్టేందుకు కూడా వెనుకాడ‌డం లేదనే విమ‌ర్శ‌లు టీటీడీ ఉద్యోగుల నుంచి వ‌స్తున్నాయి.

స‌ద‌రు ఉద్యోగి "క‌ళ‌"ల గురించి ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. ఆమెకు  ముద్దుగా స‌"కళావ‌తి" అని పేరు పెట్టిన‌ట్టు టీటీడీ ఉద్యోగులు వ్యంగ్యంగా చెబుతున్నారు. టీటీడీకి సంబంధించి తిరుప‌తిలో శ్రీ‌నివాసం, మాధ‌వం, విష్ణునివాసం వ‌స‌తి స‌ముదాయాలున్నాయి. వాటిలోని దుకాణ య‌జ‌మానుల ద‌గ్గ‌రికి త‌న అసిస్టెంట్ల‌ను పంపి, విజిలెన్స్ పేరుతో వ‌సూళ్ల‌కు తెగ‌బ‌డుతున్న‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి.

అస‌లు ఉద్యోగం వ‌దిలేసి, ప‌రిపాల‌నాప‌ర‌మైన అంశాల్లో చొర‌బ‌డి, తానే ఈవో, సీవీఎస్‌వో అని భావించి త‌మ‌పై నిత్యం వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు టీటీడీ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ మ‌హిళా ఉద్యోగి అమాన‌వీయ‌త గురించి త‌ప్ప‌క తెలుసుకోవాలి.

కొంత కాలం క్రితం టీటీడీ ఉద్యోగి మ‌ర‌ణించారు. కారుణ్య నియామ‌కం కింద స‌ద‌రు టీటీడీ ఉద్యోగి కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాల్సి వుంది. అయితే బాధిత కుటుంబానికి చెందిన మ‌హిళ‌పై విచార‌ణ పేరుతో అస‌లు ఉద్యోగానికే అన‌ర్హురాలిగా నివేదిక స‌మ‌ర్పించిన‌ట్టు తెలిసింది. దీంతో కుటుంబానికి జీవ‌నాధార‌మైన పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి ఈమె షాక్ ఇచ్చిన‌ట్టైంది. అయితే సీవీఎస్‌వో ద‌గ్గ‌రికి బాధితురాలు వెళ్లి వాస్తవాల్ని తెలియ‌జేశారు. దీంతో సీవీఎస్‌వో జోక్యం చేసుకుని, మాన‌వతా దృక్ప‌థంతో ఆలోచించి, న్యాయం చేయాల‌ని, ఇదేం పిచ్చి నివేదిక అంటూ చీవాట్లు పెట్టిన‌ట్టు తెలిసింది.

అలాగే తిరుప‌తి ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల‌లో ఒక విద్యార్థి వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. అయితే స‌ద‌రు విజిలెన్స్ మ‌హిళా అధికారి మాత్రం ప్రేమ విఫ‌ల‌మై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు నివేదిక ఇచ్చింది. దీనిపై టీటీడీ ఉన్న‌తాధికారులు అభ్యంత‌రం చెప్ప‌డం, అవాస్త‌వాల‌ను నివేదించ‌డంపై ఆమెకు చుర‌క‌లు అంటించారు.

కొంత కాలం క్రితం మ‌హిళా అధికారి సంగీత క‌ళాశాల‌కు వెళ్లారు. అయితే అక్క‌డి ఉన్న‌తోద్యోగి త‌న‌కు స‌రైన గౌర‌వం ఇవ్వ‌లేద‌ని ఆమె క‌క్ష క‌ట్టారు. దీంతో త‌న త్ర‌యంతో స‌ద‌రు ఉన్న‌తోద్యోగిపై ఫిర్యాదు చేయించి, విచార‌ణ పేరుతో వేధించిన‌ట్టు సంగీత క‌ళాశాలు ఉద్యోగులు తెలిపారు. అలాగే టీటీడీ రెవెన్యూ విభాగంలోని ఓ ఉద్యోగిపై విచార‌ణ పేరుతో ఓవ‌రాక్ష‌న్ చేసిన‌ట్టు తెలిసింది. అయితే మ‌హిళా అధికారి చేష్ట‌ల‌తో విసిగిపోయిన టీటీడీ ఉద్యోగులు... ఆమెను ఖాత‌రు చేయ‌లేద‌ని స‌మాచారం. దిక్కున్న చోట చెప్పుకోవాల‌ని, ఏం చేస్తావో చేసుకోవాల‌ని టీటీడీ రెవెన్యూ ఉద్యోగి విసిగిపోయి ఆమెకు నేరుగా వార్నింగ్ ఇవ్వ‌డం టీటీడీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అలాగే ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో స‌ద‌రు మ‌హిళా అధికారి త‌న ముగ్గురు అసిస్టెంట్ల‌తో బెంగ‌ళూరులోని మ‌ల్లేశ్వ‌రం టీటీడీ స‌మాచార కేంద్రం, ఆల‌యం వ‌ద్ద‌కెళ్లారు. అక్క‌డి ఉద్యోగుల‌ను విచార‌ణ పేరుతో భ‌య‌పెట్టిన‌ట్టు తెలిసింది. వారి నుంచి భారీ మొత్తంలో డ‌బ్బు వ‌సూలు చేసిన‌ట్టు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లున్నాయి. ఇలా ఒక‌ట్రెండు ఆరోప‌ణ‌లు కాదు... త‌వ్విన‌కొద్దీ మ‌హిళా అధికారి అవినీతి లీల‌లు వెలుగు చూస్తున్నాయి.  టీటీడీలో అన్య‌మ‌త ప్ర‌చారం మాత్ర‌మే అప‌చారం కాదు... అవినీతి అంత‌కు మించిన అప‌చార‌మ‌ని గ్ర‌హించి, స‌ద‌రు వేధింపు మ‌హిళా అధికారిని మాతృసంస్థ‌కు పంపాల‌ని టీటీడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?