Advertisement

Advertisement


Home > Politics - Andhra

బీజేపీ దృష్టిలో చంద్రబాబు దుర్యోధనుడా ?

బీజేపీ దృష్టిలో చంద్రబాబు దుర్యోధనుడా ?

ఒక పక్క వచ్చే ఎన్నికల్లో టీడీపీ -బీజేపీ మళ్ళీ పొత్తు పెట్టుకుంటాయన్న కథనాలు జాతీయ మీడియాలో హల్ చల్ చేస్తున్న సమయంలో బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోధర్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన చంద్రబాబును దుర్యోధనుడితో పోల్చారు. అంటే విలన్ అని అన్నాడన్న మాట. మహా భారతంలో దుర్యోధనుడి క్యారెక్టర్ ఎటువంటిదో తెలిసిందే కదా.  

ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ.. బీజేపీ జాతీయ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఇక, మునుగోడులో బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ - బీజేపీ పొత్తు పైన వార్తలు మొదలయ్యాయి. ఈ పొత్తు అంశం పైన సునీల్ దేవధర్ ఈ పొత్తు వార్తల పైన కొత్త విశ్లేషణ చేసారు. ధుర్యోధనుడికి కృష్ణుడు సమయం ఇచ్చారని..కానీ, చేతులు మాత్రం కలపలేదంటూ వ్యాఖ్యానించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పైన జరిగిన భేటీలో ప్రధాని మోదీ..అక్కడ చంద్రబాబుతో పాటుగా ఫరూక్ అబ్దుల్లాను కలిసిన అంశాన్ని దియోధర్  గుర్తు చేసారు. 

దీంతో..ఆయన ఎవరిని ధుర్యోధనుడిగా పేర్కొంటున్నారనేది మరో చర్చకు కారణమైంది. దీనికి కొనసాగింపుగా ఆయన ఢిల్లీ మీడియతో కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని చెప్పారు. ఇక, పొత్తుల అంశం బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని.. ఎవరో సంపాదకీయాల్లో రాసినంత మాత్రాన అది జరగదని వ్యాఖ్యానించారు.

ఏపీలో ఏ పార్టీతోనూ బీజేపీకి పొత్తు ఉండదని  స్పష్టం చేసారు. కుటుంబ వారసత్వ పార్టీలతో కలిసే ప్రసక్తేలేదని చెప్పారు సునీల్‌ దియోధర్. ప్రస్తుతం తాము ఏపీలో జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని.. వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీతోనే కలిసి పోటీ చేస్తామని చెప్పారు. అవినీతి పార్టీలైన వైసీపీ, టీడీపీకి దూరంగా ఉంటామన్నారు. అయితే సునీల్ దియోధర్ కు పొత్తుల విషయంలో టీడీపీ నేతలు మరో వాదన చేస్తున్నారు. 

మొదటి నుంచి సునీల్ టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని.. వైసీపీ డైరెక్షన్ లోనే ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పొత్తుల విషయం బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందని.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

చంద్రబాబుతో మాట్లాడిన విషయాలు సునీల్ కు తెలిసి ఉండకపోవచ్చన్నారు. అయితే, జనసేన ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నా, రెండు పార్టీల మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. బీజేపీ నేతలు.. టీడీపీతో పొత్తు వార్తలను ఖండిస్తున్నా.. టీడీపీ నుంచి మాత్రం స్పందన లేదు. రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో వైసీపీ - టీడీపీ రెండు పార్టీలు ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతుగా నిలిచాయి. వచ్చే ఎన్నికల నాటికి కేంద్రం నుంచి జగన్ కు మద్దతు లేకుండా చూడాలనేది టీడీపీ వ్యూహం. 

అదే సమయంలో వైసీపీ అధినాయకత్వం జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంది. కేంద్రంతో సత్సంబంధాలు ఎన్నికల ముందు మరింత అవసరమని భావిస్తోంది. దీంతో..టీడీపీ వేస్తున్న అడుగులకు అనుగుణంగా వ్యవహరించాలని భావిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?