cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఈ వాదన కరెక్టేనా జగన్?

ఈ వాదన కరెక్టేనా జగన్?

చెప్పినవే కాదు, చెప్పనివి కూడా చేశాం అని చెప్పుకుంటారు వైసీపీ నేతలు. కానీ అక్కడే చిన్న మతలబు ఉంది. అడిగినవి, అడగనివి అన్నీ ఇచ్చినా కూడా ప్రజలు ఆ స్థాయిలో సంతృప్తిగా ఉంటారా లేదా అనేది అనుమానమే. అందులోనూ చివర్లో మేమేమైనా అడిగామా అన్నీ ఇచ్చి ఇలా చేశారేంటి అనే ప్రశ్న కూడా ఎదురు కావొచ్చు. సరిగ్గా దుల్హన్ పథకం విషయంలో ఇదే జరిగేట్టు కనిపిస్తోంది.

మైనార్టీ వర్గాలు ఈ పథకాన్ని ఆపేయడం వల్ల నొచ్చుకుంటున్నాయి. అదే మైనార్టీలు.. తమకు ఇతర పథకాల ద్వారా అంతకు మించిన లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవడం లేదు. ఆ మాటకొస్తే గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. అడగనివి అన్నీ ఇచ్చినా, అడిగిన ఒక్కటీ ఇవ్వకపోతే అది కచ్చితంగా లోటుగానే ఉంటుంది. అదే ఇప్పుడు మైనార్టీల విషయంలో జరిగింది.

నవరత్నాల్లోని సంక్షేమ పథకాల కోసం అప్పు చేసి మరి లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. మరి పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించే దుల్హన్ పథకానికి ఎందుకు అప్పు చేయరు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకాన్ని నిలిపేశామని, హైకోర్టుకు తెలపడం ఎంతవరకు సమంజసం. దాదాపు ప్రతి పథకం అమలుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా. ఈ ఒక్క పథకానికి ఆ ఇబ్బంది ఎక్కువైందా అనే ప్రశ్న వినపడుతోంది.

నిండా మునిగాక చలేంటి..?

ఏపీలో సంక్షేమ పథకాల వల్ల అప్పులు పెరుగుతున్నాయనే మాట వాస్తవం. అయితే ఆ అప్పులు అసాధారణ స్థాయిలో ఏమీ లేవు. గత ప్రభుత్వం అప్పులు చేసి దుబారా చేసింది, జేబులు నింపుకుంది. కానీ ఈ ప్రభుత్వం అప్పులు చేసైనా సరే ప్రజలకు అది చేరవేస్తోంది. అయితే అన్ని పథకాల కోసం అప్పులు చేస్తున్నారు కదా, దుల్హన్ పథకం కోసం కూడా మరింత అప్పు చేస్తే తప్పేంటి అనే మాట వినిపిస్తోంది.

అది కూడా మూడేళ్ల తర్వాత నేరుగా ప్రజలకు చెప్పకుండా, కోర్టుకి చెప్పడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ప్రతిపక్షం విమర్శలతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే అన్న క్యాంటీన్లు ఎత్తేశారు, విదేశీ విద్యకు దూరం చేశారనే అపవాదు ఉంది. వాటివల్ల ఉపయోగం ఉందా లేదా అనే విషయం పక్కనపెడితే... ఫలానా వారి హయాంలో ఫలానా పథకం అటకెక్కింది అనే అపవాదు అయితే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో దుల్హన్ పథకం చేరింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యథిక మంత్రి పదవులు ఇచ్చామని, సామాజిక న్యాయం చేశామని చెబుతున్న ప్రభుత్వంపై.. దుల్హన్ పథకం ఎత్తివేశారనే మరక మాత్రం పడింది. అది కూడా నిధులు లేవు అనే సాకుతో పథకం ఆగడం మంచిది కాదు.

అమ్మఒడిలో కోత కోశారనే విషయం పెద్ద సంచలనమేం కాదు, అర్హులకు ఆ లబ్ధి చేకూరితే వారే ప్రభుత్వంపై అభిమానం చూపుతారు. ఇక్కడ దుల్హన్ విషయంలో మొత్తానికే పథకాన్ని ఎత్తివేయడంతో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. మరి దీన్ని ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?