Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఏపీలో టీడీపీ అధికార ఆశ‌లపై నీళ్లు చ‌ల్లిన జేసీ!

ఏపీలో టీడీపీ అధికార ఆశ‌లపై నీళ్లు చ‌ల్లిన జేసీ!

2024లో అధికారం టీడీపీదే అని ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఊరూరా రంకెలేసి మ‌రీ చెబుతున్నారు. మూడు గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో గెలుపుతో టీడీపీ ఊపు మీద ఉంద‌న్న‌ది వాస్త‌వం. ఇదే సంద‌ర్భంలో అధికార వైసీపీలో కాస్త క‌ల‌వ‌రం లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేలా ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జేసీ దివాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

చాలా రోజుల త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏ విష‌య‌మైనా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ్డం జేసీ బ్ర‌ద‌ర్స్ నైజం. ఇవాళ కూడా అదే పంథాలో జేసీ దివాక‌ర్‌రెడ్డి 2024 అధికారం ఎవ‌రిద‌నే ప్ర‌శ్న‌పై నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు. ప‌ల్లెల్లో పూర్వం అమ్మ‌, అక్క‌, ఆలి అనే ప‌దాలు వినిపించేవ‌ని ఆయ‌న అన్నారు. ఇప్పుడు ప‌ల్లెల్లో ఆ ప‌దాలు ఎక్క‌డా లేవ‌న్నారు. లేవు కాబ‌ట్టి ఇప్పుడు అసెంబ్లీలో ఆ ప‌దాలు వింటున్నామ‌న్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అసెంబ్లీకి ఎవ‌రూ పోటీ చేయ‌ర‌న్నారు. ఎవ‌రైనా పోటీ చేసినా వారు గొబ్బులేచిపోతార‌ని చెప్పుకొచ్చారు. 2024లో ఏపీలో అధికారం ఎవ‌రిద‌నే ప్ర‌శ్న‌కు జేసీ దివాక‌ర్‌రెడ్డి త‌న మార్క్ స‌మాధానం ఇచ్చారు. ఇప్పుడే చెప్ప‌లేమ‌న్నారు. ఓట‌రు నాడి అంతుచిక్క‌డం లేదన్నారు. ప్ర‌జ‌లు చాలా నిగూఢంగా ఉన్నారన్నారు. 

అధికారంలోకి ఎవ‌రొస్తారో వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో చెప్పొచ్చని ఆయ‌న అన్నారు. జేసీ వ్యాఖ్య‌లు టీడీపీ శ్రేణుల‌కి రుచించ‌డం లేదు. ఏపీలో రాజ‌కీయంగా ప‌చ్చ‌గాలి వీస్తోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న ప‌రిస్థితిలో, సొంత పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు అందుకు విరుద్ధంగా మాట్లాడ్డం ఏంట‌నే నిల‌దీత‌లు టీడీపీ నుంచి ఎదుర‌వుతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?