Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

ఇవేం బదిలీలు చంద్రబాబు గారూ..!

ఇవేం బదిలీలు చంద్రబాబు గారూ..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థులను వారి వారి బలా బలాలను బట్టి ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మార్పు చేయడం.. ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని ఎంపీలుగా, ఎంపీలుగా ఉన్న వారిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించడం వంటి కసరత్తు చేశారు. ఇలాంటి కసరత్తు సాధారణంగా ఏ పార్టీలో అయినా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది.

పార్టీ అవసరాలను, కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ ఇలాంటి పనులు పార్టీలు చేస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి అలాంటి మార్పు చేర్పులు చేసినప్పుడు తెలుగుదేశం ఎద్దేవా చేసింది. అభ్యర్థులను బదిలీ చేస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు వెటకారం చేశారు. ఇప్పుడు బదిలీలు అంటే అసలు ఎలా ఉంటాయో? ఎలా చేయాలో? చంద్రబాబు నాయుడు మార్గదర్శనం చేస్తున్నారు. 

పేరుకు ఎన్డీఏ కూటమి అంటున్నారు. మూడు పార్టీలు కలిసి సీట్లు పంచుకున్నాయి అంటున్నారు. కానీ నామినేషన్ల పర్వం వచ్చేసరికి జాగ్రత్తగా గమనిస్తే.. అన్ని పార్టీల తరఫున తెలుగుదేశం అభ్యర్థులే బరిలో నిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా తమ పార్టీ వారిని ఇతర పార్టీల్లోకి బదిలీ చేసి అక్కడ టికెట్ ఇప్పిస్తున్నారు. జనసేన, బిజెపి కూడా.. ఏదో పట్టుదలకు పోయి సీట్లు తీసుకున్నాయి తప్ప సొంతంగా అభ్యర్థులను నిలబెట్ట లేకపోతున్నాయి.

ఆ పార్టీలకు అంత బలం ఉండడం లేదు. ఆ పార్టీల గతిలేనితనం తెలుగుదేశానికి అదృష్టంగా కలిసి వస్తుంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను జనసేనలోకి పంపి అక్కడ టికెట్లు ఇప్పించిన చంద్రబాబు.. తాజాగా ఒక తిరుగుబాటు అభ్యర్థిని భారతీయ జనతా పార్టీలోకి పంపి, అక్కడ టికెట్ ఇప్పిస్తున్నారు. చంద్రబాబు కుటిల రాజకీయానికి ఇతర పార్టీలు, మిత్రపక్షాలే అయినా డంగైపోతున్నాయి. తమకు వేరే గతిలేక, చేసేదిలేక అయిష్టంగానే ఒప్పుకుంటున్నారు.

తాజాగా తెలుగుదేశం నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. అనపర్తి నియోజకవర్గం నుండి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు తరఫు దూతలు నల్లమిల్లితో చర్చలు జరిపి సూత్రప్రాయంగా అంగీకరింప జేసినట్టు సమాచారం. భారతీయ జనతా పార్టీ కూడా ఆయనకు ఆహ్వానం పంపింది. ఇక ఆయన కమలం కండువా కప్పుకోవడం లాంఛనమే అని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం తరఫున టికెట్ ఆశించారు. పొత్తుల్లో ఆ సీటు బిజెపికి పోయింది. బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ప్రచారంలో ఉన్నారు. అయినా నల్లమిల్లి వెనక్కు తగ్గలేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. బుజ్జగింపులకు లొంగక పోవడంతో.. చంద్రబాబు మరో ఎత్తుగడ వేశారు. అనపర్తి సీటు తమకు ఇచ్చేస్తే తంబళ్లపల్లె సీటు ఇస్తామని బిజెపికి ప్రతిపాదించారు.

అయితే తంబళ్లపల్లె లో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి మీద గెలవడం అంత ఈజీ కాదు. పైగా అక్కడ టీడీపీ అభ్యర్థి కూడా వీక్ అనే ప్రచారం ఉంది ఆ సీటు వదిలించుకోవాలని చంద్రబాబు చూశారు గానీ, బిజెపి ఒప్పుకోలేదు. దీంతో బదిలీ రాజకీయం చేస్తున్నారు. తమ నాయకుడిని బిజెపి లోకి బదిలీ చేసి అక్కడ టికెట్ ఇప్పిస్తున్నారు. చంద్రబాబు కుటిల రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారని అంతా అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?