Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌కు భ‌ద్ర‌త వుందా?

ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌కు భ‌ద్ర‌త వుందా?

మాజీ ఎంపీ, సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌కు భ‌ద్ర‌త వుందా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. విజ‌య‌వాడ‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై రాయి దాడి నేప‌థ్యంలో ఉండ‌వ‌ల్లికి త‌గిన భ‌ద్ర‌త క‌ల్పిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మవుతోంది. ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ సుదీర్ఘ‌కాలం రాజ‌కీయాల్లో కొన‌సాగిన‌ప్ప‌టికీ, ఆర్థికంగా ఆయ‌న స్థితిమంతుడు కాదు. నిజాయ‌తీగా జీవితాన్ని గ‌డుపుతున్నారు.

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరు పొందారు. అలాగే కాంగ్రెస్ అగ్ర నాయ‌కుల‌కు అనువాద‌కుడిగా వారికి ద‌గ్గ‌ర‌య్యారు. అయిన‌ప్ప‌టికీ ఆ ప‌రిచ‌యాల‌ను ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చుకోడానికి ఆయ‌న ఎప్పుడూ వాడుకోలేదు. అందుకే ఇప్ప‌టికీ ఆయ‌నంటే స‌మాజం గౌర‌వంగా చూస్తుంది. పేరుకు సామాన్య రాజ‌కీయ నాయ‌కుడే అయిన‌ప్ప‌టికీ, ఆయ‌న తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద కొండ‌గా పేరున్న వ్య‌క్తితో ఢీకున్నాడు. ఆ పే...ద్ద కొండే చెరుకూరి రామోజీరావు.

ఈనాడు మీడియా సంస్థ‌ల గ్రూప్ అధినేత‌. మీడియాను అడ్డం పెట్టుకుని, ఒక‌ప్పుడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌హామ‌హులైన రాజ‌కీయ నాయ‌కుల్ని త‌న చెప్పు చేత‌ల్లో పెట్టుకున్నారు. అయితే ఆయ‌న్ను వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మాత్రం ఖాత‌రు చేయ‌లేదు. తాను చెప్పింద‌ల్లా ఎన్టీఆర్ విన్నంత కాలం  ఆయ‌న‌కు రాజ‌కీయంగా రామోజీ అండ‌గా నిలిచారు. ఎప్పుడైతే కాదు, కుద‌ర‌ద‌న్నారో, చివ‌రికి ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించ‌డానికి కూడా వెనుకాడ‌లేదు. ఎన్టీఆర్‌ను సీఎం పీఠంపై నుంచి కూల‌దోయ‌డంలో కంటికి క‌నిపించేది చంద్ర‌బాబు మాత్ర‌మే. ఆయ‌న వెనుక ఈనాడు రామోజీరావు ఉన్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

అయితే రామోజీకి అన్ని రోజులూ ఒకేలా వుండ‌వ‌ని ప్ర‌కృతి రుచి చూపింది. మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ సంస్థ ద్వారా ఆర్బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం రూ.2,600 కోట్లు వసూలు చేసింద‌ని కాంగ్రెస్ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ గుర్తించారు. ఉండ‌వ‌ల్లి కుటుంబ స‌భ్యులే మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్‌లో డిపాజిట్ చెల్లిస్తుండ‌డంతో రామోజీ నేతృత్వంలో న‌డుస్తున్న మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ బాగోతం బ‌య‌ట ప‌డింద‌ని ఉండ‌వ‌ల్లి తెలిపారు.

అప్ప‌ట్లో వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా వుండ‌డంతో మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్‌కు సంబంధించి కేసు వేగంగా న‌డిచింది. అయితే వైఎస్సార్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో కేసు న‌త్త‌న‌డ‌క న‌డిచింది. ఉండ‌వ‌ల్లికి మ‌ద్ద‌తు కూడా కొర‌వ‌డింది. ఆయ‌న‌ది ఒంటరిపోరు అయ్యింది. ఆ త‌ర్వాత కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌కు దారి తీసింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు విడిపోవ‌డానికి ఒక్క రోజు ముందు రామోజీరావు త‌న‌పై న‌మోదైన కేసును గుట్టు చ‌ప్పుడు కాకుండా కొట్టేయించుకోగ‌లిగారు. అయితే ఈ కేసుపై పోరాడుతున్న ఉండ‌వల్లి అరుణ్‌కుమార్‌కు హైకోర్టు కొట్టివేత గురించే తెలియ‌క‌పోవ‌డం ప్ర‌పంచ ఎనిమిదో వింత‌గా చూడొచ్చు.

రామోజీరావుపై కేసు కొట్టి వేయ‌డం గురించి తెలుసుకున్న ఏడాదికి ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. సుప్రీంకోర్టు రామోజీ, మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్‌పై కేసు విచార‌ణ చేప‌ట్టింది. రామోజీరావు దేశంలోనే అత్యంత ప్ర‌ముఖులైన‌, కాస్ట్‌లీ లాయ‌ర్ల‌ను పెట్టుకున్నారు. కానీ ఉండ‌వ‌ల్లి ప‌రిస్థితి అది కాదు. ఉండ‌వ‌ల్లికి క‌లిసొచ్చిన ఏకైక అంశం... ఈ కేసులో ఏపీ ప్ర‌భుత్వం ఇంప్లీడ్ కావ‌డం. ఉండ‌వ‌ల్లికి ఉచితంగా వాదించే స్నేహితులైన లాయ‌ర్లకు తోడు ఏపీ ప్ర‌భుత్వ లాయ‌ర్లు.

ఈ నేప‌థ్యంలో రెండు రోజుల క్రితం కీల‌క తీర్పు సుప్రీంకోర్టు వెలువ‌రించింది. చ‌ట్ట ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డినందుకు రామోజీరావు, మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాల‌ని కోరుతూ నాంప‌ల్లి కోర్టులో ఇచ్చిన ఫిర్యాదును కొట్టి వేస్తూ ఉమ్మ‌డి హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ తేల‌ప్రోలు ర‌జ‌ని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేసిన కార‌ణంగా త‌మ‌పై కేసులు కొట్టి వేయాలని రామోజీ, మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ చేసిన అభ్య‌ర్థ‌న‌ల‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చ‌ట్ట విరుద్ధంగా వ‌సూలు చేసిన సొమ్మును తిరిగి ఇచ్చామంటే కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ ద్వారా చ‌ట్ట విరుద్ధ డిపాజిట్ల సేక‌ర‌ణ‌పై నిగ్గు తేల్చాల్సిందే అని తేల్చి చెప్పింది. మార్గ‌ద‌ర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు న్యాయ‌మూర్తి ఏక‌ప‌క్షంగా ఇచ్చిన తీర్పును ప‌క్క‌న పెడుతున్నామ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. తాజాగా మ‌ళ్లీ విచార‌ణ చేప‌ట్టి ఆర్నెళ్ల‌లో ముగించాల‌ని ఆదేశించింది.

దీంతో రామోజీరావు భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌క‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌చ్చ బ్యాచ్ ఆగ‌డాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చూస్తున్నాం. త‌మ అధికారానికి, ఆధిప‌త్యానికి అడ్డం వ‌స్తే... ఎంత‌టి వారినైనా ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌ని మ‌న‌స్త‌త్వం వారిది. ఎన్టీఆర్ అంత‌టి గొప్ప వ్య‌క్తిని అధికారం నుంచి దించేయ‌డంతో పాటు ఆయ‌న మాన‌సికంగా కుంగిపోయి ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన వారితో సామాన్యులు పోరాటం చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అందులోనూ ఒక కొండ‌లాంటి వ్య‌క్తి కేసు కీల‌క ద‌శ‌కు చేరింది. దీనంత‌టి ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ప‌ట్టుద‌ల‌, నిబ‌ద్ధ‌తతే కార‌ణం.

ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ అనే వ్య‌క్తే లేక‌పోతే, ఇవాళ స‌మాజంలో చాలా పెద్ద మ‌నుషులుగా చెలామ‌ణి అవుతున్న వారి బండారం బ‌య‌ట ప‌డేది కాదు. త‌మ‌ను న్యాయ‌స్థానానికి ఈడ్చి, త్వ‌ర‌లో ఆర్థికంగా దివాలా తీయించ‌డానికి కార‌ణ‌మైన ఉండ‌వ‌ల్లిపై క‌క్షతో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కావున ఉండ‌వ‌ల్లి భ‌ద్ర‌త‌పై పౌర స‌మాజం, మేధావులు, విజ్ఞులు, జ‌ర్న‌లిస్టులు ఆందోళ‌న చెందుతున్నారు. ఆయ‌న‌కు త‌క్ష‌ణం భ‌ద్ర‌త క‌ల్పించాల‌నే డిమాండ్ వారి నుంచి వెల్లువెత్తుతోంది. చ‌ట్టం అంద‌రికీ స‌మాన‌మే అని నిరూపించ‌డానికి అవిశ్రాంత పోరాటం చేస్తున్న యోధుడిని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై వుంది. ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డితే స‌మాజం హ‌ర్షిస్తుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?