ఎన్నికల సంఘం తీరుపై వైసీపీ గుర్రుగా వుంది. ఈ ఎన్నికల్లో ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిందనే అభిప్రాయం సామాన్య ప్రజానీకంలో సైతం వుంది. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్లే …కూటమికి అనుకూలంగా ఈసీ నడుచుకుందని సర్వత్రా చర్చనీయాంశమైంది. అందుకే చర్యలు తీసుకోవడంలో వివక్ష చూపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తమ ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్‌పై నోరు పారేసుకున్నా ఈసీకి చీమ కుట్టినట్టైనా లేదనే విమర్శ బలంగా వుంది. మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించినట్టు …ఈసీతో కూడా కూటమి పొత్తు పెట్టుకుందా? అనే అనుమానం వ్యక్తమవుతోందని చాలా మంది అనుకుంటున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని, అలాగే డీజీపీని ఇష్టానుసారం మార్చి, టీడీపీకి ఎన్నికల్లో ప్రయోజనం కలిగించేందుకు ఈసీ ప్రయత్నించిందని వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా పల్నాడులో గొడవలకు కేవలం ఎస్పీ ఒంటెత్తు పోకడలే కారణమని వైసీపీ ఆరోపణ. ఎన్నికల తర్వాత కూడా శాంతిభద్రతలను అదుపులో ఉంచలేక పల్నాడు ఎస్పీ చేతులెత్తేశారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తుంటే, ఈసీ, అలాగే ఏరికోరి వేసుకున్న పోలీస్ అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారనేది వైసీపీ విమర్శ. ఈసీ అడుగడుగునా కూటమికి తొత్తుగా వ్యవహరిస్తూ, తమను ఇబ్బంది పెట్టేందుకు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వైసీపీ నేతలు అంటున్నారు.